న్యూ బీట్ బజార్ ధర్మారం శివారులో 3 ఎకరాలలో రెండు వెంచర్లు
జాగా ఉంటే చాలు వెంచర్ సిద్ధమవుతోంది
అనుమతులు ఉండవు..అడిగే వారు ఉండరు
ఒకే ప్రాంతంలో ఎదురెదురుగా అక్రమ వెంచర్లు
అమ్మకానికి అంతా సిద్ధం..అనుమతులే పూజ్యం
నగరం, నగర శివార్ల లోని ఖాళీ జాగలన్ని ప్రస్తుతం వెంచర్లుగా మారిపోతున్నాయి. ఖాళీగా ఉన్న ఎకరాల కొద్దీ జాగలను ఎంతకో కొంతకు కొనుగోలు చేసి రియల్ వ్యాపారులు వెంచర్లనీ ప్రారంభిస్తున్నారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ శివారులో వెంచర్లు బాగా పుట్టుకొస్తున్నాయి. ఖాళీ జాగా ఉంటే చాలు జాగా ధరకు అనేక రేట్లు సంపాదించడం కోసం వెంచర్లు వేసి అందినకాడికి దండుకుంటున్నారు.
ధర్మారం శివారులో….
వరంగల్ రూరల్ జిల్లా ధర్మారం శివారు న్యూ బీట్ బజార్ లో కొత్తగా రెండు వెంచర్లు పుట్టుకొచ్చాయి. ఒకే ప్రాంతంలో ఎదురెదురుగా ఒక వెంచర్ ఎకరం స్థలంలో, మరో వెంచర్ రెండెకరాలలో అక్రమ దర్జాను వెలగబెడుతున్నాయి. పచ్చని ప్రాంతాన్ని మొత్తంగా చదును చేసి వెంచర్ వేసి ప్లాటు లు అమ్మకానికి పెట్టారు. ఒకే ప్రాంతంలో పోటాపోటీగా ప్లాట్లను అమ్మకానికి పెట్టుకున్నారు.
అనుమతులు నిల్…
ధర్మారం శివారు న్యూ బీట్ బజార్ లో నిర్వహిస్తున్న ఈ రెండు వెంచర్లకు ఇప్పటివరకు అసలు ఎలాంటి అనుమతులు లేవు. కుడా అనుమతి, నాల కన్వర్షన్ లేకుండానే ఈ రెండు వెంచర్లు ప్లాట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం భూమిని చదును చేసి వెంచర్ లో ఎలాంటి రహదారులు కూడా వేయకుండా వెంచర్ యజమానులు అమ్మకాలకు తెరతీశారు. ఖాళీ జాగను చూపించి జనానికి ప్లాట్లు అంటగడుతున్నారు.
అధికారులు దృష్టి పెట్టాలి
ధర్మారం శివారు లో ఉన్న అనుమతి లేని వెంచర్లపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ వేసినవారిపై చర్యలు తీసుకొని వెంచర్ ను తొలగించాలని పలువురు కోరుతున్నారు. వెంచర్ లో కనీసం రహదారుకు కూడా నిర్మించకుండా కేవలం ఖాళీ భూమిని చూపించి ప్లాట్ లు విక్రయించడం సరికాదని స్థానికులు అంటున్నారు.