కోటికి పైగా ….. మింగేశారు

భూమి ఒకరిది పరిహారం ఇంకొకరికి
ఓసి 3 బూనిర్వాసితుల్లో కొందరికి పైసా దక్కలేదు
నకిలీ కాగితాలు సృష్టించి కోటికి పైగా మింగిన ఘనుడు
ఓ సర్పంచ్ భర్త, సింగరేణి అధికారి సూత్రధారులు
వ్యవసాయ భూమిని ఇంటిస్థలంగా చూపుతూ అదనపు పరిహారం పొందేందుకు స్కెచ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మరావు పేట, కొండపల్లి శివారు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-3 లో భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరికి బదులు ఇంకొకరికి నకిలీ కాగితాలను సృష్టించి అసలు సంబంధం లేకుండా నష్ట పరిహారాన్ని దిగమింగినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. సింగరేణిలో ఓ అధికారి అండ దండలతో ఇదే ప్రాంతానికి చెందిన ఓ సర్పంచ్ భర్త కోటి రూపాయలకు పైగా దిగమింగినట్లు ప్రచారం జరుగుతోంది. 2004 సంవత్సరం లో భాదితుల వద్ద నుంచి సింగరేణి భూమి సేకరించి నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పి అసలైన నిర్వాసితులకు కాకుండా నకిలీ నిర్వాసితులకు పరిహారం అందచేసిందని ఈ తతంగం అంతా నడిపించడంలో సదరు సింగరేణి అధికారి హస్తం ఉన్నట్లు భాదితులు చెపుతున్నారు.

కోటికి పైగా ..... మింగేశారు- news10.app

కోటికి పైగా మింగింది ఇలా..

ఓ సి-3పనుల కోసం సింగరేణి కొండపల్లి గ్రామ శివారులో రైతుల వద్ద నుంచి భూమిని సేకరించాక ఈ సేకరణలో గ్గ్రామానికి చెందిన గండ్ర దామోదర్ రావు, తక్కల్లపల్లిభారతలక్మి, ఎర్రబెల్లి సుజాత, దాసరి లక్ష్మయ్య, కనుకుంట్ల రమ, చెనుమల్ల వేణుగోపాల్, కొడకండ్ల శ్యామసుందర్, వీరగోని ఆశోక్ లు 6 ఎకరాల32 గుంటల భూమిని కోల్పోయారు. నిజానికి వీరికి సింగరేణి అధికారులు నష్ట పరిహారం అందజేయలేదు ఇదే భూ సేకరణ లో భూమిని కోల్పోయిన ఓ సర్పంచ్ భర్త సింగరేణి అధికారితో దగ్గరగా మెదులుతూ.. వీరి పేర్లకు బదులుగా వీరి సర్వే నెంబర్ లతోనే నకిలీ కాగితాలు సృష్టించి ఐలోని శశిరేఖ, కర్ర ప్రభావతి, కురుమ రమాదేవి, కొండ పద్మప్రియ, కొండ రాణి, మాదాడి కరుణాకర్ రెడ్డి,, బాల రాజేంద్రప్రసాద్రెడ్డి, కొండం రవీందర్ రెడ్డి ల పేర అక్రమంగా నష్ట పరిహార సొమ్మును మింగేసినట్లు భాదితులు చెప్తున్నారు. వీరు అక్రమంగా నష్ట పరిహారం పొందిన విషయం సింగరేణి అధికారులకు తెలిసినా సర్పంచ్ భర్తతో కుమ్మక్కై తెలిసినా తెలియనట్లుగానే నటిస్తూ16 సంవత్సరాలుగా కొంతమంది భూ నిర్వాసితులను అష్టకష్టాలు పెడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సర్వే నెంబర్ లపై అసలు సంబంధం లేని వ్యక్తులు సింగరేణి నుంచి నష్ట పరిహారం పొందితే అసలైన నిర్వాసితులం ఏం చేయలేని స్థితిలో ఉన్నామని భాదితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎకరాకు15 లక్షల చొప్పున 8 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి న నష్టపరిహారాన్ని నకిలీ రైతుల పేర కోటి రూపాయలకు పైగా మింగి సర్పంచ్ భర్త దర్జాగా తిరుగుతున్నాడని భాదితులు ఆరోపించారు.

వ్యవసాయ స్థలం…. ఇంటి స్థలంగా మార్చాడు

కొండపల్లి లో సర్పంచ్ భర్తకు 318/44 సర్వే నెంబరులో3 ఎకరాల 30 గుంటల స్థలం ఉండగా భూమి అంతా ఓ సి-3 కోసం సింగరేణి తీసుకుంది .దీనికి సంబంధించిన నష్టపరిహారం సైతం అందజేసింది. అయితే దీనిలో ఇంకా 20 గుంటల స్థలాన్ని సింగరేణి అధికారి సాయంతో ఇంటి స్థలంగా మార్చి అధిక మొత్తంలో నష్టపరిహారం పొందేందుకు సర్పంచ్ భర్త స్కెచ్ వేశాడట. దీనిలో భాగంగా ఇటీవలే ఈ 20 గుంటల భూమిలో తాత్కాలికంగా ఇంటిని కట్టాడట. వ్యవసాయ భూమిలో ఉన్న ఈ ఇంటికి దారి కోసం సింగరేణి అధికారే స్వయంగా సంస్థ ఖర్చుతో మొరం పోయించి దారి వేయించడాట. నిజానికి వ్యవసాయ భూమికంటె నివాస స్థలానికి నష్ట పరిహారం ఎక్కువ వస్తుందనే ఆలోచనతో వీరిద్దరూ కలిసి ఈ ప్లాన్ చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

కోటికి పైగా ..... మింగేశారు- news10.app

అధికారులు విచారణ చేయండి

ఓ సి-3 భూనిర్వాసితుల నష్టపరిహారం చెల్లింపులో జరిగిన అవకతవకలపై సింగరేణి అధికారులు తక్షణమే విచారణ చేపట్టి అసలైన భూనిర్వాసితుల కు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నకిలీ కాగితలతో తమ పేర, తమ సర్వే నెంబర్ లతో కోటికి పైగా డబ్బులను అక్రమంగా తీసుకున్న సర్పంచ్ భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.