మారుమూల గ్రామాల సమగ్ర అభివృద్ధికి మారుమూల కిరణం పేరుతో అభివృద్ధి పనులు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని అభివృద్ధికి దూరంగా ఉన్న మారుమూల గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని, జిల్లాలో గుర్తించిన గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో త్వరగా సర్వే నిర్వహించి గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పై పూర్తి సమాచారం సేకరించి అందించాలని, ఆ సమాచారం ప్రకారం జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నేతృత్వంలో గల జిల్లా స్థాయి కోర్ కమిటీ అధికారులు మండల, గ్రామ స్థాయి అధికారుల సహకారంతో గ్రామాల్లో మౌలిక వసతులు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, పౌష్టికాహారం కల్పన, వైద్యం, మార్కెటింగ్ సదుపాయాలు, త్రాగునీరు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ప్రజల జీవన ప్రమాణం పెంపొందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి మారుమూల ప్రాంతాల్లోని పల్లెలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయేలా మారుమూల కిరణం కార్యక్రమాన్ని నెల రోజుల లోపల ప్రారంభించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజావిక్రమ్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి పురుషోత్తం, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఆర్డిఓ వై.వి గణేష్, జడ్పీ సీఈవో శిరీష, డిఆర్డిఓ సుమతీ, ఎడి ల్యాండ్ సర్వే సుదర్శన్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.