ఇదేనా అభివృద్ధి…..? అభివృద్ధికి నోచుకోని శాయంపేట మండల కేంద్రం
ప్రధాన రహదారి అంతా గుంతల మయం.
పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు.
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో వాన చినుకు పడితే చాలు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలతో దర్శనమిస్తోంది. ఎక్కడ చూసినా గుంతలు ఏర్పడడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎమ్మెల్యే గండ్ర దంపతులు మండల కేంద్రానికి వచ్చిన ప్రతిసారి శాయంపేట మండల కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడమే గానీ ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
అభివృద్ధి అంటే ఇదేనా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ప్రధాన రహదారి పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో నీరు నిలిచిపోయి రహదారి అధ్వానంగా ఉంది. మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.అంబేద్కర్ సెంటర్ నుండి ప్రభుత్వ బాలుర పాఠశాల వరకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఉన్న కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకర మంటున్నారు.
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు బారీగా నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. పల్లె ప్రగతి కార్యక్రమం లో గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలని చెప్పే అధికారులు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలలో పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం విడ్డూరం. పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మండల కేంద్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకునే గండ్ర దంపతులు అభివృద్ధి అంటే ఇదేనా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. శాయంపేట మండల కేంద్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెప్పడానికి ఇదే నిదర్శన మంటున్నారు.