చిన్నగూడూర్ లో చిందులేసిన పాలకవర్గం
పంచాయితీ నిధులు తాగుడుకు
సేంద్రియ ఎరువుల కేంద్రాన్ని బారుగా మార్చిన వైనం
పాలకవర్గాన్ని చీ..కొడుతున్న ప్రజలు
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి –గ్రామస్తుల డిమాండ్
తూ తూ.. మంత్రాంగ డి పి ఓ విచారణ
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల గ్రామపంచాయతీ పాలకవర్గం తాగి చిందులేసింది. గ్రామపంచాయతీ అభ్యున్నతికి పాటుపడాల్సిన పాలకులు దారి తప్పి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకాంగ పంచాయితీ నిధులను విడుదల చేసి తాగి తందాన చేశారు. ప్రభుత్వ నిధుల తో నిర్మించిన సేంద్రీయ ఎరువుల కేంద్రాన్ని బారుగా మార్చి స్టేపుల్లేశారు. ఏదో గొప్పలు చేశామన్న రీతిలో ఫొటోలకు ఫోజులిచ్చారు. దింతో ఆ పోటోలు బయటకు లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కోటడంతో చిన్నగూడూరు పంచాయితీ పాలకుల బాగోతం బయటపడింది. దింతో ఓ మహనీయుడు దాశరథి పుట్టిన గడ్డకు మచ్చ తెచ్చిన పాలకుల పై గ్రామ ప్రజలు చీ కొడుతూ మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు లో గ్రామపంచాయతీ లో అధికార పార్టీ కి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్ , కొంతమంది వార్డు సభ్యులు కలిసి గ్రామాభివృద్ధి కోసం మంజూరు ఐన 30 లక్షల నిధుల నుండి 23 లక్షల రూపాయలు డ్రా చేశారు.. తూ.. తూ మంత్రాంగ 5 లక్షల రూపాయల తో గంగమ్మ గుడి దేవస్థానం వద్ద సీసీ రోడ్డు పనులు చేపట్టారు.. మిగిలిన నిధులను స్వాహా చేసి ఇలా పార్టీలు చేశారు. గంగమ్మ గుడి దేవస్థానం సమీపంలో ని సేంద్రీయ ఎరువుల కేంద్రాన్ని బారుగా మార్చుకొని బీర్లు పొంగిచ్చారు. యాట పోతును కోసి అలై బలై చేసుకున్నారు. ముక్క కొరికి.. సుక్కేసి జల్సాలు చేసుకున్నారు. ఈ పాలకుల పై ఇప్పటికే అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. తాగి స్టెప్పులు వేయడంతో అక్రమాలకు పాల్పడుతున్నారనేది ప్రజల కు తేటతెల్లమైంది.
చీ కొడుతున్న గ్రామస్తులు
ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికార పార్టీ సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సబ్యులపై చిన్న గూడూరు గ్రామ ప్రజలు చీ కొడుతున్నారు. నూతనంగా మండల కేంద్రంగా ఏర్పాటైన చిన్న గూడూరు ను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎన్నో ఆశలతో ఈ పాలక వర్గాన్ని ఎన్నుకున్న గ్రామ ప్రజల కు నిరాశే ఎదురైంది. పంచాయితీ నిధులను ఫలహారం లాగా పంచుకొని పార్టీలు చేసుకున్న పాలకులను అసహించుకుంటున్నారు.
పాలకులపై చర్యలు తీసుకోవాలి
అనేక అక్రమాలకు పాల్పడుతూ..జల్సాలు చేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రజా ధనం దుర్వినియోగంకు పాల్పడిన గ్రామ పాలక వర్గాన్ని తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పంచాయితీ నిధులను ఫలహారం లాగా పంచుకునే వీళ్ళు అభివృద్ధి కోసం పాటుపడేది లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తూ.. తూ.. మంత్రాంగ డి పి ఓ విచారణ
తాగి జల్సాలు చేసిన చిన్నగూడూరు గ్రామపంచాయతీ పాలక వర్గం పై జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. కాగా పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నామమాత్రంగా విచారణ చేశారనే ఆరోపణలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం వచ్చామా వెళ్ళామా అన్న రీతిలో అధికారులు తూ..తూ మంత్రాంగ విచారణ జరిపినట్లుగా విమర్శలు వస్తున్నాయి.