ఈ ఆపత్కాలంలో అందరం కలిసి కట్టుగా ఉందాం. సేవా బావంతో మసలుదాం. మానవతను చాటుదాం. ఆర్థిక సంక్షోభం ఉన్నా… సీఎం కెసిఆర్ గారు ప్రజా సంక్షేమం వీడలేదు. ఓ పూట ఉపాసమైనా ఉందాం కానీ, మనమంతా కరోనా బారి నుండి మన ప్రాణాలను కాపాడుకుందాం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొనల్ పల్లి, కొండూరు గ్రామాల్లో నిరుపేదలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు కరోనా సమస్య, ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది. అయినా సరే, సిఎం కెసిఆర్ మాత్రం ప్రజల ప్రాణాలే ముఖ్యమంటున్నారు. ఓ పూట ఉపాసమైనా ఉంటాం కానీ, ప్రజల ప్రాణాలను కాపాడాలనే దృఢ చిత్తంతో మన సీఎం ఉన్నారు. ఆయనకు మనమంతా సహకరిద్దాం. అని అన్నారు. మన కోసం మన సీఎం బియ్యం ఇస్తున్నారు. డబ్బులిస్తున్నారు. పెన్షన్లు ఆపలేదు. రైతులను ఆదుకుంటున్నారు. ఇంకా అనేకం చేస్తున్న సీఎం గారికి మనం సహకరిద్దామని మంత్రి చెప్పారు.
సరిగ్గా ఇలాటి సమయంలోనే మనమంతా ఏకతాటిపై నిలవాలి. లాక్ డౌన్ ని పకడ్బందీగా పాటించాలి. మన ప్రాణాలను దక్కించుకోవాలి. కరోనా ఖతమయ్యేదాకా ఇళ్ళ నుంచి ఎవరూ బయటకు రావొద్దు. ఇదే సమయంలో మన ఊళ్ళల్లో ఉండే నిరుపేదలకు మనమే సాయపడదాం. తిండికి లేని పేదొళ్ళనే మనమే ఆదుకుందాం. ఒకరికి పెడితే, మనకు దేవుడు కలిగిస్తాడు. అని మంత్రి ప్రజలకు హితవు పలికారు. దాతలు ఎందరొచ్చినా అందరికీ సాయం చేయడం సాధ్యం కాదు. కాబట్టి, ఒకరికొకరం మనకు మనమే సాయం కావాలి. అందుకు ఉన్న వాళ్ళంతా నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.