పార్టీ ఆవిర్భావ పండుగను నిరాడంబరంగా జరుపుకుందాం — ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు.
ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది.
ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నిరాడంబరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటూ, సామాజిక హితానికి పాల్పడదాం అంటూ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తప్పకుండా మాస్కులు ధరించడం తోపాటు ప్రజలకు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో పంపిణీ యుద్ధప్రాతిపదికన జరగాలని, పంపిణీ జరిగేటప్పుడు తప్పకుండా సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, గుంపులుగా చేరవద్దని ఆయన సూచించారు. టిఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్ ను ధరించిన ఫోటోలను ఈ సందర్భంగా సంతోష్ కుమార్ విడుదల చేశారు. అదే రకమైన మాస్క్ లను తయారుచేసి, పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ రకమైన మాస్క్ లను ధరించిన ఫోటోలను తనకు షేర్ చేయాలని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకులకు సూచించారు.