వరంగల్ తూర్పులో మరింత బలపడేందుకు కొండా దంపతుల స్కెచ్
రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలకు పకడ్బంది వ్యూహం
మేయర్ బిసి రిజర్వేషన్ కావడం కలిసొచ్చే అంశమా…?
కార్పొరేషన్ బరిలో కూతురును దింపేందుకు సిద్దమవుతున్న కొండ
ఇప్పటికే తూర్పులో తన అనుచరగణం తో మంతనాలు..?
కొండ వైపు మొగ్గుచూపుతున్న కొంతమంది తూర్పు నాయకులు..?
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ గాలి మళ్ళీ విచేందుకు అనువైన పరిస్థితులు కల్పించుకునేందుకు కొండా దంపతులు తహ తహ లాడిపోతున్నారట. తూర్పు నియోజకవర్గంలో ఓ సారి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం, పార్టీ మారి వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి తమ సొంత మనుషులుగా ఉండే కొంతమంది అనుచరులతో తప్ప సామాన్య ప్రజానీకానికి ద్వితీయ శ్రేణి నాయకులకు కొండా దంపతులు దూరంగానే ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రియాశీలక రాజమియాలకు కొండా దంపతులు దూరంగానే ఉన్నారన్నమాట. నిజానికి కొండా దంపతులు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాల, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో అభిమానులు, హార్డ్ కోర్ అనుచరులను కలిగి ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కొండా దంపతులు అంటే అభిమానం కలిగినవారు ఉన్నారు. ప్రత్యర్థి ని అంచనా వేయడంలో, నమ్మిన వారికి సాయం చేయడంలో కొండా దంపతులు ముందు వరుసలో ఉంటారని వారి అభిమానులు చెప్తుంటారు. అలాంటి కొండా దంపతులు క్రియాశీలక రాజకీయాలకు గత సంవత్సరం కాలం నుంచి దూరంగానే ఉంటున్నారు.
ఇక తూర్పు పైనే దృష్టి..?
క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కొండా దంపతులు పరకాల, భూపాలపల్లి అంటూ రెండేసి పడవల ప్రయాణం చేయకుండా కేవలం వరంగల్ తూర్పు నియోజకవర్గం పైనే దృష్టి సారించాలని వారు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేవలం తూర్పును కేంద్రంగా చేసుకొని క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ పూర్వ వైభవాన్ని పొందాలని వారు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దింతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హేమహేమీల మద్య రాజకీయ చదరంగం రసవత్తరంగా నడవబోతుందని తూర్పులో ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కొండా దంపతులను ఢీ కొనాలంటే ప్రస్తుతం ఉన్న నాయకులు తమ శక్తి వంచన లేకుండా పనిచేయాల్సి వస్తుందని, వరంగల్ పశ్చిమ లో లేని పోటీ వరంగల్ తూర్పులో ఏర్పడబోతుందని కొందరు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.
అనుచరగణం తో మంతనాలు..?
తూర్పులో తిరిగి పాగా వేసి క్రియాశీలక రాజకీయాలకు దగ్గర కావాలని చూస్తున్న కొండా దంపతులు ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని తమ అనుచరగణం తో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. జనం నాడి ఎలా ఉంది… ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఎవరిని చేరదీస్తే ప్లస్ అవుతుంది అనే ఇంకా అనేక అంశాలపై వారి చర్చించినట్లు తెలుస్తుంది.
పకడ్బందీ వ్యూహం
రానున్న నగర పాలక ఎన్నికల నుంచి తూర్పు రాజకీయాల్లో మరో మారు క్రియాశీలకం కావాలని కొండా దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ తూర్పులోని 23 డివిజన్లలో తమ సత్తా చాటి గ్రేటర్ వరంగల్ లో పాగా వేయాలని చూస్తున్నారట. మరోవైపు మేయర్ పదవి బిసి రిజర్వేషన్ కావడంతో కొండాదంపతులు తమ కూతురు సుస్మిత ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట.. ఈ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటుకొని తూర్పులో పైచేయి సాధించి అసెంబ్లీ ఎన్నికల వరకు మరింతగా బలపడాలని వారు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోవాలని చూస్తున్నారట. గతంలో లాగా కాకుండా ప్రస్తుతం తమ రాజకీయ చతురతను ఉపయోగించి పొలిటికల్ స్టైల్ ను కొద్దిగా మార్చి సరికొత్తగా తూర్పులో అడుగు పెట్టాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
కొండా వైపు కొందరి మొగ్గు?
క్రియాశీలక రాజకీయాలకు కొండా దంపతులు కొద్దిగా దూరం కావడం, పదవులు ఏవి లేకపోవడంతో కొంతమంది ప్రజాప్రతినిదులు, ద్వితీయ శ్రేణి నాయకులు కొండా దంపతులకు దూరం ఐయారు. కొందరు వేరే పార్టీల్లో కొనసాగుతున్నారు. ఐయితే కొండాదంపతులు తూర్పులో తిరిగి అడుగుపెడితే చాలామంది నాయకులు, ఇతర పార్టీల వారు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే చాలామంది నాయకులు కొండా దంపతులతో టచ్ లో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి కొండాదంపతులు తూర్పులో అడుగుపెడితే రాజకీయ సమీకరణాలు అటుఇటుగా మారే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కొండా దంపతులు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి తూర్పులో పాగా వేయాలని చూస్తే ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు తమ గెలుపుకోసం ఇప్పటినుంచే చెమటోడిచ్చాల్సి వస్తుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.