సింగారం లో…. పనుల ‘బెట్టు’

ఇంకా సాగుతున్న పనులు… అపరిశుభ్రంగా వీధులు
సరఫరా చేయని మిషన్ భగీరథ నీరు.
హరితహారం మొక్కలకు రక్షణేది…?నర్సరీలో కరువైన మొక్కలు.
రోజంతా వెలుగుతున్న వీధి లైట్లు….ఇదేనా ఆదర్శ గ్రామం.
నిద్రావస్థలో అధికారులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు.

శాయంపేట మండలం లోని కొత్త గట్టు సింగారం గ్రామంలో అభివృద్ధి పనులు కుంటు పడి వెక్కిరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పచ్చదనం నిండే విధంగా వీధుల్లోని రోడ్డుకిరువైపులా మొక్కలను నాటి రక్షించాలని అధికారికంగా ఆదేశాలు ఉన్న అవేమి తమకు పట్టనట్టుగా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్లుగా పంచాయతీ కార్యదర్శి స్థానిక సర్పంచ్ గ్రామ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని ఆదర్శ గ్రామమైన కొత్త గట్టు సింగారం గ్రామ పరిస్థితి ఇది.

సింగారం లో.... పనుల 'బెట్టు'- news10.app

అపరిశుభ్రంగా వీధులు

కొత్త గట్టు సింగారం గ్రామంలో ఏ వీధి చూసిన చెత్తా చెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. “స్వచ్ఛభారత్ స్వచ్ఛ గ్రామం’కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు విస్మరించి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్న వారి చేత పనులు చేయించే ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయం లోపంతో గ్రామంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దళిత కాలనీలో వీధులు అపరిశుభ్రంగా మారి సైడ్ డ్రైనేజీలలో నీరు నిలిచి దుర్వాసన వస్తున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సరఫరా చేయని మిషన్ భగీరథ నీరు

కొత్త గట్టు సింగారం గ్రామంలో ని ప్రజలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేయక పోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ప్రధాన పైప్ లైన్ ఇష్టారాజ్యంగా వేయడం వల్ల పైపులు పగిలి లీకేజీ లు ఎక్కువై నీరు సరఫరా చేస్తే మురుగు నీరు వస్తుందని గ్రామస్తులు వాపోయారు. ప్రధాన పైపులైను సమస్య పరిష్కరించకుండా నే కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు మిషన్ భగీరథ ద్వారా అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కాంట్రాక్టర్లు తూట్లు పొడుస్తున్నారనే దానికి ఇది నిదర్శనం గా నిలుస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు.

రోజంతా వెలుగుతున్న వీధిలైట్లు

గ్రామంలో విద్యుత్ స్తంభాలకు అమర్చిన ఎల్ ఈ డి వీధిలైట్లు రోజంతా వెలుగుతూనే ఉన్నాయి. గ్రామంలో ప్రధాన కూడలిలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఆన్ ఆఫ్ కనెక్షన్ ఇవ్వకుండా వీధిలైట్లు అమర్చడం వల్ల రోజంతా వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది రోజంతా వీధిలైట్లు వెలుగుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విడ్డూరం. వీధిలైట్లు రోజంతా కాకుండా రాత్రిపూట వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

హరితహారం మొక్కలకు రక్షణేది…?

గ్రామంలోని వీధుల్లో ఉన్న సిసి రోడ్లకు ఇరువైపుల హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కల కు రక్షణ లేకుండా పోయింది. గ్రామంలో లో ఎక్కడ చూసినా మొక్కలు విరిగిపోయి, చిందరవందరగా పడి ఉన్నాయి. కొన్ని మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వం నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులకు అప్పజెప్పిన ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామంలోని వీధులలో పదుల సంఖ్యలో మొక్కలు విరిగిపోయి, ఎండిపోయి దర్శనమిస్తున్నా…. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మొక్కల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా సంబంధిత అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోక పోవడం గమనార్హం.

నర్సరీలో కరువైన మొక్కలు

కొత్త గట్టు సింగారం గ్రామంలో ఉన్న నర్సరీలో మొక్కలు లేక ఖాళీగా ఉంది. నర్సరీలో నాటిన మొక్కలు మందార, గన్నేరు, గడ్డిగులాబి, గులాబీ మొక్కలు నామమాత్రంగా నాటినా వాటిలో కొన్ని మొక్కలు మాత్రమే మొలకెత్తాయి. వర్షాకాలం లో పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా నర్సరీలో మొక్కల పెంపకం పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచి ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తున్నారు. నర్సరీలో మొక్కల పెంపకం లో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

ఇదేనా…. ఆదర్శ గ్రామం

కొత్త గట్టు సింగారం గ్రామం. ఆదర్శ గ్రామం అని ప్రకటించిన అధికారులు సమస్యలు తాండవిస్తున్న పట్టించుకోకపోవడం బాధాకరం. దళిత కాలనీలో సైడు కాలువల్లో క్లోరినేషన్ చేయక పోవడం వల్ల నీరు నిల్వ ఉండడం తో దోమలు విజృంభించి ప్రజలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతల పై ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించక పోవడంతో ఇంకుడు గుంతల నిర్మాణం ఎక్కడా జరగలేదు. సిసి రోడ్ లు చెత్తా చెదారంతో నిండి అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను సంరక్షించకపోవడంతో మొక్కలు విరిగిపోయి చిందరవందరగా పడి ఉన్నాయి.ఆదర్శ గ్రామానికి ఉండాల్సిన నియమ నిబంధనలు ఏమీ లేకున్నా ఇష్టారాజ్యంగా అధికారులు ప్రజా ప్రతినిధులు ఆదర్శ గ్రామం గా ప్రకటించుకున్నారని గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు.

నిద్రావస్థలో అధికారులు. పట్టించుకోని ప్రజాప్రతినిధులు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాభివృద్ధి కోసం డంపింగ్ యార్డ్ లు, వైకుంఠధామం, మొక్కల పెంపకం (నర్సరీ), ప్రకృతి వనాలు,హరితహారం పథకంలో భాగంగా వీధుల్లో ఉన్న మొక్కల సంరక్షణపై అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేసి పర్యవేక్షించాల్సిన అధికారులు నిద్రమత్తులో తూగుతున్నారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న దుర్బలమైన పరిస్థితి గ్రామాల్లో నెలకొని ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి….ఇకనైన అధికారులు,ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధి పై దృష్టి సారిస్తారో లేదో చూడాలి.