ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆపన్నులకు అండగా ఉండేందుకు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనాధలు, ఈ కష్ట సమయంలో తిండి దొరకక అలమటిస్తున్న వలస కార్మికుల కడుపునింపేందుకు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమన్వయం చేసుకొని ప్రతీ ఒక్కరికి భోజనం అందేలా చర్యలు తీసుకునేందుకు నోడల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
‘నిజామాబాద్ అన్నదాతలం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నార్తులకు ఆకలి బాధను తీర్చేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్న వారిని సమన్వయం చేసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ భోజనాలు అందించాలో చూసుకునే విధంగా నోడల్ అధికారి సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల అన్నం వృథా కాకుండా ఆకలితో అలమటించే ప్రతి ఒక్కరి దరికి భోజనాన్ని అందించేలా ఈ వ్యవస్థ పని చేస్తుంది. దీంతో పాటు భరోసా పేరుతో మరో కార్యక్రమాన్ని మంత్రి జిల్లాలో ప్రారంభించారు. జిల్లాలో పాజిటివ్ వచ్చిన 61 మంది కుటుంబ సభ్యుల పట్ల చుట్టుపక్కల సమాజం అంటరాని వారిగా చూడటం దారుణామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సొంత ఖర్చులతో వారికి సరిపడే నిత్యావసరాలు ఇంటి వద్దకే తీసుకువెళ్లి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.