మనోడే కొంచెం చూడు… కేసులు గీసులు ఎందుకు…? ఏదన్న ఉంటే ఖాతాదారులతో మాట్లాడుకోమని చెప్తం… జర చూసి చూడనట్లు వదిలేయండి ఇది చిట్ ఫండ్ యజమానుల తరఫున వకాల్తా పుచ్చుకున్న కొంతమంది పైరవికారుల మాటలట… చీటి వేసిన ఖర్మానికి ఖాతాదారులను ముప్పు తిప్పలు పెడుతూ అవసరం అయితే ఖాతాదారులను బెదిరిస్తున్న చిట్ ఫండ్ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ రిమాండ్ చేయాలని చూస్తుంటే కొంతమంది రాజకీయ ముసుగులో వారిని కాపాడేందుకు పైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
ఫోన్ల తాకిడి….?
చిట్ ఫండ్ యజమానులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీస్ అధికారులకు ఫోన్ల తాకిడి విపరీతంగా పెరిగిపోయినట్లు తెలిసింది. చిట్ ఫండ్ కార్యాలయాలపై దాడులు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చిట్స్ యజమానులను అదుపులోకి తీసుకోగానే వదిలిపెట్టాలని ఫోన్ లు చేసి పైరవీలు చేశారట కొంతమంది. కాగా పైరవీలు చేసిన వారిలో అధిక సంఖ్యలో రాజకీయ నాయకులే ఉన్నారట. దీంతో ప్రతి చిట్ ఫండ్ మోసం వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని స్పష్టం అవుతోందని చిట్స్ ఖాతాదారులు అంటున్నారు. చిట్స్ యజమానుల మోసాలను బయటపెట్టి సామాన్య జనాన్ని కాపాడాల్సిన రాజకీయ నాయకులే వారి తరపున పైరవీలు చేయడం దారుణం అంటున్నారు.
బడా నాయకుల అభయహస్తం…?
ఇదిలావుండగా చిట్ ఫండ్ లు స్థాపించి చిట్స్ వేసిన ఖాతాదారులను మోసం చేస్తున్న చిట్ ఫండ్ యజమానుల వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. చిట్ ఫండ్ లద్వారా వసూలు చేసిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ పేరుతో భూములు కొన్న చిట్స్ యజమానులతో కొంతమంది ఎమ్మెల్యేలు సైతం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం లో ఆరితేరిన ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు కొన్ని చిట్ ఫండ్ లకు రియల్ వెంచర్ కోసం కావాల్సిన భూములను సైతం వారే సమకూర్చినట్లు తెలుస్తుంది. ఇంతటి దగ్గరి సంబంధం కలిగిన ఈ ఎమ్మెల్యేలు పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని చిట్ ఫండ్స్ యజమానులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చిట్ ఫండ్ ల వల్ల నష్టపోయిన కొంతమంది ఖాతాదారులు ఈ ఎమ్మెల్యేలకు తమ గోడును వెల్లబోసుకున్న లైట్ గా తీసుకున్నట్లు తెలిసింది.
ఇలా అయితే ఎలా…?
చిట్ ఫండ్ ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి.చిట్ వేసిన ఖాతాదారులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తూ ప్రజల సొమ్మును వేరే వ్యాపారాల్లో వెచ్చిస్తున్న చిట్స్ యజమానుల తరపున కొంతమంది ప్రజాప్రతినిధులు వకాల్తా పుచ్చుకోవడం పట్ల ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల వల్ల తమకు న్యాయం జరుగుతుందని చూస్తుంటే చిట్ ఫండ్ యజమానులను ప్రజాప్రతినిధులు కాపాడాలని చూడడం సరికాదంటున్నారు.ప్రజాప్రతినిధులు ఇలా చేస్తే సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.