త్రినగరిలో బార్ నిర్వాహకుల ఇష్టారాజ్యం…
ఉదయం 4.30 గంటలనుండే మద్యం అమ్మకాలు
ఎక్సైజ్ అధికారులకు కనిపించని బార్లు…
తనిఖీలు ఉండవు,చర్యలసలే లేవు
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు …?
బార్ షాపు నిర్వాహకులకు ప్రజాప్రతినిధులు, పోలీస్ ల అండదండలు…?
వరంగల్ త్రినగరిలో బార్ షాపుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది…. ఇరవై నాలుగు గంటలు బార్ షాపులు నడుపుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు… రాత్రి పదకొండు కాగానే మెయిన్ షెట్టర్ మూసివేసి చిన్న షెట్టర్ ద్వారా కొందరు అమ్మకాలు కొనసాగిస్తుంటే….. మరికొందరు మాకేమికాదు అన్నట్లు తెల్లవార్లు బార్ ఓపెన్ చేసే ఉంచుతున్నారు… ఈ బార్ షాపుల ఇరవై నాలుగు గంటల వ్యాపార దందా ఎక్సైజ్ అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వదిలేస్తున్నారు… దింతో బార్ షాపుల యాజమాన్యాలు అమ్మినోళ్ళకు అమ్మినంత అన్నట్లు మద్యం ప్రియులకు ఎనీ టైం మద్యం రుచి చూపిస్తూ సమయాన్ని బట్టి మద్యం రేట్లు పెంచుతూ జేబులు ఖాళీ చేస్తున్నారు.
తెల్లవారు జామునే మొదలు…
వరంగల్, హన్మకొండ ప్రాంతంలోని కొన్ని బార్ షాపులు ఉదయం నాలుగున్నర గంటలకే మద్యం అమ్మకాలు షురూ చేస్తున్నారు… తెల్లవారు జామున బార్ షాపులు దర్జాగా ఓపెన్ చేసి దందా కొనసాగిస్తున్నారు… ఈ బార్ షాపులు తెల్లవారు జామునే నడిపిస్తున్న దందా న్యూస్10 నిఘా టీమ్ కెమెరాకు చిక్కింది. హన్మకొండ లష్కర్ బజార్ ప్రాంతంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన బార్ తెల్లవారుజామునే అమ్మకాలను కొనసాగిస్తోంది… ఉదయం నాలుగున్నర గంటలకు మొదలయే ఈ బార్ ఓ రెండు గంటలు మూసి ఉంటుంది తప్ప తెల్లవార్లు అమ్మకాలు కొనసాగుతూనే ఉంటాయట.. అసలే ప్రజాప్రతినిధి కనుక పోలీసులు కానీ ఎక్సైజ్ అధికారులు గాని అటువైపు కన్నెత్తి కూడా చూడరు… వీరందరికి ఆ బార్ షాప్ ఎవరిదో తెలుసుగనుక వ్యాపారం చేసుకోవడానికి ఏ నిబంధనలకు తూట్లు పొడిచిన అడిగే వారు ఉండరన్న మాట… లాక్ డౌన్ మూలంగా నష్టపోయాం అందుకే ఇలా ఇరవై నాలుగు గంటలు నడుపుతున్నాం అంటూ కొన్ని బార్ షాపుల యజమానులు పోజులు కొడుతుండగా… మరి ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్మకాలకు అనుమతి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు… నిజానికి లాక్ డౌన్ పరిస్థితి రాకముందు నుంచి కూడా నగరంలోని కొన్ని బార్లు తెల్లవారుజామునే తెరుచుకునేవని…. ఇప్పటికి అదే విధానం కొనసాగుతుండగా లాక్ డౌన్ నష్టం సాకు చూపుతున్నట్లు తెలిసింది. నగరంలోని సరస, రాజ శివాజీ, మధుశాల, గౌడ బార్లు తెల్లవారు జామునే మద్యం అమ్మకాలను కొనసాగించడం న్యూస్10 నిఘా టీం కు చిక్కింది…. మద్యం అమ్మకాలతో పాటు ఆ సమయంలో మద్యం ప్రియుల సిట్టింగ్ కూడా నిఘా టీం గమనించింది.
ఎక్సైజ్ అధికారులు ఎక్కడ…?
నిత్యం ఎక్సైజ్ నిబంధనల గూర్చి పదే పదే చెప్పే అధికారులు త్రినగరిలో తెల్లవారు జామునే మద్యం అమ్మకాలు కొనసాగుతున్న పట్టించుకోక పోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది… అర్ధరాత్రి దాటిన కూడ అమ్మకాలు కొనసాగిస్తున్న చూసి చూడనట్లే ఉండే అధికారులు తెల్లవారు జామునే బార్ షాపులు ఓపెన్ చేస్తున్న ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారో అర్థం కావడం లేదు. బార్ షాపుల యాజమాన్యాలు ఎక్సైజ్ అధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్లే ఈ బార్ షాపుల మద్యం అమ్మకాల దందా ఇరవై నాలుగు గంటలు నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ షాపులను నియంత్రిచాల్సిన పోలీసులు సైతం గమ్మున ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది… నగరంలో ఉన్న కొన్ని బార్ షాపులకు ప్రజాప్రతినిధుల, ఎక్సైజ్, పోలీసుల అండదండలు ఉండడం మూలంగానే ఎలాంటి భయం లేకుండా తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని పలువురు అంటున్నారు… ఇకనైనా ఎక్సైజ్ అధికారులు కళ్ళు తెరిచి తెల్లవారుజామునే మద్యం అమ్మకాలు చేస్తున్న బార్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు…. మరి ఈ బార్ షాపులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటారా… లేక నగర ప్రజల అనుమానాలను నిజం చేస్తారా… వేచి చూడాల్సిందే.