హనుమకొండ జిల్లా బిజెపి కార్యాలయం పై జరిగిన దాడిపై కేంద్ర నిఘా వర్గాల ఆరా తీసినట్లు తెలిసింది.ఇటీవల బిజెపి కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం.ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్బంగా రాజస్థాన్ రాజ్యసభ సభ్యులు ఓం ప్రకాష్ మాథుర్ హనుమకొండ జిల్లా కు వచ్చిన సందర్భంలో ఈ దాడి జరగడాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
దాడి చేసింది కాంగ్రెస్సే నా లేదా టి ఆర్ ఎస్ వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.పోలీసులకు తెలియకుండా వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకోవడం సాధ్యం కాదని, పోలీసుల వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుందని,దేశ ప్రధాని పర్యటనకు ముందు ఇలా జరగడం పై కేంద్ర నిఘా వర్గాలు నివేదికలు పంపినట్టు విశ్వసనీయ సమాచారం.
అసలేం జరిగింది.?
ఇటీవల హనుమకొండ జిల్లా బిజెపి అధ్యక్షులు రావు పద్మ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాజ్యసభ సభ్యులు ఓం ప్రకాష్ మాథుర్ గ్రేటర్ వరంగల్ 53 వ డివిజన్ లోని సింగారం వీధి పర్యటనకు వెళ్తుండగా హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు హనుమకొండ జిల్లా బీజేపీ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపే సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ ఇరువురి మధ్య దాడికి దారి తీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి,పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే క్రమంలో, కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఓ సిఐ గన్ మెన్ కు తల పగిలింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలియగానే వందల సంఖ్యలో బిజెపి కార్యకర్తలు కార్యాలయానికి చేరుకున్నారు.తిరిగి 53 వ డివిజన్ పర్యటనకు వెళ్తుండగా పోలీసులు ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ ని అరెస్ట్ చేయుటకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
మాథుర్ నివేదికలో ఏముంది?
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్, అటు టి ఆర్ ఎస్ లు బిజెపి ని టార్గెట్ చేస్తున్నారంటే, బిజేపీ ఇక్కడ చాలా బలంగా తయారవుతుందని కేంద్ర పెద్దలకు మాథుర్ తన నివేదికను పంపారని తెలియవచ్చింది