వరంగల్ నగర శివారులో మున్సిపల్ ఉద్యోగి దర్జాగా అక్రమ వెంచర్ దందా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది.. అధికారులను ప్రసన్నం చేసుకొని ఎలాంటి అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్ కానిస్తున్నట్లు సమాచారం… మున్సిపల్ కార్పోరేషన్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఎలక్ట్రిషన్ గా ఉద్యోగం చేస్తున్న సదరు ఉద్యోగి ఐనవోలు మండలం కొండపర్తి శివారులో సింగారం రోడ్ లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి దర్జాగా వెంచర్ చేసి 70 శాతం ప్లాట్లకు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం… అసలు విషయం ఏమిటంటే ఈ ఉద్యోగి వెంచర్ చేసిన భూమికి తహశీల్దార్ డిజిటల్ సైన్ కూడా కాలేదట పాస్ బుక్ లేకుండా కుడా అనుమతి తీసుకోకుండా దర్జాగా వెంచర్ చేయడం వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు పాట్లు …?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎలక్ట్రిషన్ గా ఉద్యోగం చేస్తున్న ఇతగాడు పాస్ బుక్ పెండింగ్ లో ఉన్న వ్యవసాయ భూమిలో అక్రమంగా వెంచర్ చేసి 40 ప్లాట్లు చేసాడు .అందులో 30 ప్లాట్లకు పైగా కొంతమంది వద్ద అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తాన్ని దండుకున్నాడట. ఇది అక్రమ వెంచర్ అని తెలియని అమాయకులు అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కోసం ఆ ఉద్యోగిని అడుగుతుండడంతో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక ఈ ఎలక్ట్రిషన్ పడరాని పాట్లు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
డాక్యుమెంట్ కు 30 వేలు…?
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం రోడ్ లోని కొండపర్తి శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్ చేసిన ఈ ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రిషన్ అందులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి తిప్పలు పడుతున్నట్లు తెలియవచ్చింది. అసలు పాస్ బుక్ డిజిటల్ సైన్ కాకుండానే” కుడా “అనుమతి లేకుండానే ఆ భూమిలో ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ వెంచర్ లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావు కావున ఓ మధ్యవర్తి తో సబ్ రిజిస్ట్రార్ ను ఒప్పించుకొని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం సబ్ రిజిస్ట్రార్ కు ప్లాటుకు 30 వేలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది.