తెలుగు జర్నలిజంలో ఏక్కడో ఓ చోట కనీసం మిణుగురు పురుగు లాగానైన ఓ వెలుగు వెలగాలనేది ఓ ఆశ,అశయం అందుకు తగ్గట్టుగానే నాకు తోచిన,చేతనైన రీతిలో నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను.ఈ ప్రయత్నంలో అనేక ఆటు పోట్లు, మోసాలు,నమ్మక ద్రోహాలు,మానసిక శ్రమదోపిడికి గురి కావడాలు బారెడు పనిచేస్తే మూరెడు కూడా వేతన ప్రతిఫలం దక్కని వెతలు.వీటన్నింటిని అధిగమిస్తూ జర్నలిజంలో నిలదొక్కుకుంటూనే వస్తున్నాను.లైన్ అకౌంట్ లకోసం ఎదురు చూపులు,వేతనం కోసం మొహం వాచిపోయిన సందర్భాలు అనేకం అయిన జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించాం కనుక భరించాం. అయితే ఈ జర్నలిజం ప్రయాణంలో అనేక సంస్థలు మారిన సందర్భం ఉంది. దీన్ని కొంతమంది మిత్రులు,శ్రేయోభిలాషులు నా మైనస్ పాయింట్ గా చూసారు. చూస్తున్నారు కూడా. ఆర్కే ఒక్క చోట నిలకడగా ఉండడు. అని పెదవి విరిచే వారు సైతం ఉన్నారు.
ఈ మిత్రులందరికీ ఒకే మనవి లైన్ అకౌంట్లు,వేతనం పై ఆధారపడి జర్నలిజం లో కొనసాగిన నేను దీని ద్వారానే ఆర్థిక వెసులుబాటును పొందాను అది రాని చోట వెంటనే ఆ సంస్థను వదిలేసాను అంతే తప్ప నిలకడ లేక కాదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటు అక్కడే ఎందుకు కొనసాగాలని వదిలేసా.కొంతమంది ఘోస్ట్ రైటర్ లా నన్ను ఉపయోగించుకొని అప్పుడు,ఇప్పుడు అంటూ ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసినవారు ఉన్నారు.ఇంకొంతమంది ఏరు దాటాక తెప్ప తగిలేసిన చందంగా పత్రిక అభివృద్ధికి అహర్నిశలు కష్టపడితే చెప్పుడు మాటలు చెవులారా..విని మీ సేవలు చాలని పరోక్ష సంకేతాలు పంపితే నిశ్శబ్దంగా బయటపడ్డాం.
జర్నలిజంలో స్వతంత్రత ఉండాలని,జర్నలిస్ట్ ఎప్పుడు స్వేచ్ఛ విహంగం లా జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూ జనయిష్టుడు గా ఉండాలని ఆకాంక్షించే నేను ఈ ఉపద్రవాన్ని ఎప్పుడో ఊహించుకున్నాను,పసిగట్టాను కనుక అంతగా బాధ పడలేదు.అయితే దూరం అయిన వారిపై, సంస్థను వదిలి వెళ్ళిన వారిపై ఏవో అబాండాలు, బురద జల్లే కార్యక్రమాలు చేయాలి కనుక ప్రస్తుతం అది కొనసాగుతుంది.జర్నలిజంలో నావ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసుకనుక,నా పై నాకే అచెంచలమైన విశ్వాసం ఉంది కనుక వీటన్నింటిని తేలిగ్గానే కొట్టి పారేసుకుంటున్నాను.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను జర్నలిజంలో కొనసాగుతూ అనేక ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటు గుండె ధైర్యంతో ముందుకు వెళ్తున్నానంటే మా నాన్నే కారణం ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడి గా పనిచేసి పదవి విరమణ చేసిన మా నాన్నే నాకు గుండె బలం,ఆర్థిక పరమైన ఆసరా ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నప్పటి నుండి పాఠశాల ప్రార్థన సమయంలో నాచేత వార్తలు చదివించి ,పొద్దున్నే ఆల్ ఇండియా రేడియో లో వార్తలు వింటూ అవిరాసి వార్తల బుక్ ను నా పుస్తకాల సంచీలో పెట్టిపంపిన మా నాన్నే నన్ను జర్నలిజం వైపు మళ్లించారు.అందుకే నేను ఆర్థికంగా కొంత కష్టమైన ఎంతో ఇష్టంగా జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించాను.
నిబద్ధతతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పనిచేస్తుంటే ఆరోపణలు చేసిన పెద్దమనుషులు ఉన్నారు.అండర్ వేర్, ఓ కొత్త చొక్కా, కొత్త చెప్పులో,బూట్లో వేసిన,కొనుక్కున్న తాను వేతనం ఇవ్వకున్న ఇవి కొనుగోలు చేయడం ఎలా సాధ్యం అవుతుందనే రంధ్రాన్వేషణ చేసిన వారు ఉన్నారు.30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే నేను 50 రూపాయలు పెట్టి భోజనం చేసిన దాన్ని గొప్ప విందు గా చిత్రీకరించి బద్నాం చేసినవారు ఉన్నారు.పత్రిక అభివృధ్ధికోసం ఎంతగా కష్టపడిన ఏమాత్రం గుర్తించని వారి గూర్చి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది.
ఈ అనుభవాల నేపథ్యంలో సొంతంగా పత్రికను నిర్వహించాలనే ఓ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాను.మిత్రుల సహకారంతో జర్నలిస్టులే యాజమాన్యంగా న్యూస్10 అనే పత్రికను ప్రారంభించబోతున్నాం. హన్మకొండ చౌరస్తా ప్రాంతంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసాం.భాషపై,రచన వ్యాసా0గంపై,జర్నలిజం పై పూర్తి పట్టు ,అవగాహన ఉన్న వృత్తి నిబద్ధత గల జర్నలిస్టు మిత్రులు పత్రికలో నాతో కలిసి ప్రయాణం చేయడానికి సదా సిద్ధంగా ఉన్నారు.ఈ పత్రికను ఆదరించి ఆశర్వదిస్తారని కోరుకుంటున్నాను.
జర్నలిస్టు మిత్రులు తమ విలువైన సలహాలు,సూచనలు అందిస్తారని ఆశిస్తున్నాము. మీ ఆదరణ,మీ తోడ్పాటు మాకు కొండంత బలాన్ని ఇస్తుందని నమ్ముతున్నాం.ప్రజలకు ఉపయోగకరమైన,నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిజాలను నిర్భయంగా వెల్లడిస్తామని హామీ ఇస్తున్నాం.ఎలాంటి ఆదురు, బెదురు లేకుండా అవినీతి అక్రమార్కులను ఉతికి ఆరేస్తాం. విశ్వసనీయమైన న్యూస్ నెట్ వర్క్,న్యూస్ సోర్స్ లతో న్యూస్10 తెలుగు దినపత్రిక,ఇంగ్లీష్ దినపత్రిక,వెబ్ పోర్టల్,యూట్యూబ్ ఛానెల్ లతో మేము ముందుకు వస్తున్నాం మమ్మల్ని సదా ఆదరిస్తారని మరోమారు ఆశిస్తూ సదా జనహితాన్ని కాంక్షిస్తూ…..
మీ అభిమాన పాత్రుడు
రామకృష్ణ చెన్న (RK)
సీనియర్ జర్నలిస్ట్
(9542005777)
[email protected]