‘పీవీ’ మన ‘ఠీవీ ‘

మన మాజీ భారత ప్రధాని కీ.శే.పాముల పర్తి వెంకట నర్సింహారావు గారి శత జయంతి, (28 – 06 – 2020 ) సందర్భంగా నాలుగు మాటలు రాస్తున్నాను.

భారత దేశ ప్రధాని పదవిని చేపట్టిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడు అందునా తెలుగు వాడు. వ్యక్తిగతంగా స్వతహాగా వివేకవంతుడు, ముఖంలో ఎటువంటి భావాలు కనపడనీయడు. అంతర్యం అంత సులువుగా బయట పడని అంతర్ముఖుడు. ఆయన ఒక న్యాయవాది, బహు భాషాకోవిదుడు, రచయిత, జర్నలిస్టు, కంప్యూటర్ నిపుణుడు, ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు, అపర చాణక్యుడు. కాంగ్రేస్ నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం ఐదేళ్ళపాటు అధికారంలో ఉండి నడిపించిన ఘనత ఆయనది. 21-06-1991 నుండి 16 – 05 – 1995 వరకు.

'పీవీ' మన 'ఠీవీ '- news10.app

అంతకు పూర్వం దీర్ఘకాలం వివిధ హొదాల్లో…

కేంద్రంలో హోంశాఖ,విదేశీ వ్యవహారాల శాఖ ,రక్షణ శాఖ,మానవ వనరుల శాఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గా ఆయన గడించిన అనుభవాలు ఆయన్ను రాజీవ్ గాంధీ హత్యానంతరం, ప్రధాని అభ్యర్ధిగా పార్టీలో అందరికీ ఆమోదయోగ్యుడిగా గుర్తింప బడుటకు దోహద పడినాయి. అప్పటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అధినేత ఎన్.టీ.ఆర్ ఆయన మీద ఉన్న గౌరవంతో నంద్యాల పార్లమెంటు సీటుకు తనపార్టీ నుండి అభ్యర్థిని కూడ నిలబెట్టలేదు.

ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే అప్పటి ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖను దూరదృష్టితో కట్టపెట్టి అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థను సరళీకృత విధానాల ద్వారా మొత్తం రూపురేఖలనే మార్చి వేసినారు.సరలీకరణకు ముందు పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెత్తనం ఉండేది. ఉదార ఆర్థిక విధానాలను అమలు పరిచి ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసి, అంతకు ముందు అనుమతి లేని అనేక రంగాల్లో దేశ, విదేశీ ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి అవకాశం కల్పించారు. విదేశీ పెట్ఝుబడులకు ప్రోత్సాహం అందించారు.పెట్టుబడులకు అనేక రాయితీలు కల్పించారు ‌నూతన పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణ చేసి పూర్తిగా ప్రైవేటీకరణ చేసినారు. ఒక్క సారిగా ప్రభుత్వ రంగానికి ఉన్న ప్రాధాన్యత తగ్గి పోయింది. ప్రైవేటు రంగం ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువైనాయి. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు పన్నుల సవరణ చర్యలు, ద్రవ్యోల్బణం నియంత్రణ కు తోడ్పడినాయి. అలా ఆర్థిక స్థిరీకరణ జరిగి పారిశ్రామిక రంగం లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంష్థతో ఏర్పడిన ఒప్పందం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు 47 టన్నుల బంగారం మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ కు 20 టన్నుల బంగారం చెల్లింపు కింద ఇవ్వవలసి వచ్చింది. అలా పీవీ మన్మోహన్ సింగ్ ల సమర్థ నాయకత్వం వల్ల సంక్షోభం నుంచి బయట పడగలిగింది భారత ఆర్థిక వ్యవస్థ.

దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలల స్థాపనకు మరియు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల స్థాపనకు నాంది పలికి, విద్యావ్యవస్థలో కీలక మార్పులు తెచ్చి విద్యారంగాన్ని మెరుగు పరచడానికి కృషి చేసిన వ్యక్తి. ఈ సందర్బంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏడాది పాటు వేడుకలు ఘనంగా నిర్వహించ తలపెట్టి నందులకు ఆయనను అభినందించాలి. పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ కె. కేశవరావు గారిని చైర్మన్ గా నియమిస్తూ ఒక ఉత్సవ కమిటీ ని కూడ ఏర్పాటు చేశారు. పలు సూచనలు, ఎన్నో మంచి మంచి ప్రతి పాదనలు ప్రకటించారు. అందులో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తాను.

ముఖ్యంగా పీవీ గారు భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హులు అని, తెలంగాణా శాసన సభలో ఇందుకుగాను తీర్మానం చేసి కేంద్రానికి పంపుట.

మాజీ రాష్ట్రపతి కలాం గారికి , రామేశ్వరం లో మెమోరియల్ ఏర్పాటు చేసినట్లుగానే , హైదరాబాద్ లో పీవీ నరసింహారావు గారికి కూడా ఒక స్మారక చిహ్నం నిర్మించాలనే ప్రతిపాదన.

రాష్ట్ర శాసనసభలో పీవీ గారి చిత్రపటాన్ని పెట్టుటయే గాక ఆయన శిలావిగ్రహాలను ఐదింటిని, హైదరాబాద్, వరంగల్ , కరీంనగర్ ,వంగర మరియు ఢిల్లీలో ని తెలంగాణా భవన్ లో నెలకొల్పే ఆలోచన.

ఆయన రాసిన పుస్తకాలను పునర్ముద్రించి విద్యాసంస్థలు, గ్రంథాలయాలకు ఉచిత పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

దాదాపుగా యాబై దేశాలలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రకటించారు.
కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.

ఢిల్లీలోని ఏక్తాస్థల్ సముదాయం లో, పివీ మెమోరియల్ ఘాట్ నిర్మించాలని భాజపా ప్రభుత్వం నిర్ణయించింది.

భారత ప్రధానిగా ఆయన మరణానంతరం, ఆయనకు తగిన గౌరవం ఇవ్వక పోగా ఆయన పార్థివదేహాన్ని, స్వరాష్ట్రంలో అంత్యక్రియల కోసం హైదరాబాద్ కు పంపించి అవమాన పరిచిన కాంగ్రేసు పార్టీకి ఈ నిర్ణయం ఈడ్చి రెండో చెంప ఛెళ్ళు మనిపించి నట్లే.

మొదటి చెంప పటేల్ ను స్వంతం చేసుకొని ఆయనకు ప్రపంచంలో నే ఎత్తైన విగ్రహం నెలకొల్పి నప్పుడే వాయించి వదిలేసారు. ఒకానొక సందర్భంగా 1983 లో అలీన దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన స్పానిష్ లో ప్రసంగించి క్యూబా అధ్యక్షుడు ఫిఢేల్ క్యాస్ట్రో ని ఆశ్చర్యచకితుని చేసాడు. ఆయన విదేశీ భాషా పరిజ్ఞానం ఆవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. పీవీ నరసింహారావు గారు ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. నిజాయితీ పరుడు. తన బంధువులూ స్నేహితులనే కాకుండా ఆయన సంతానాన్ని కూడ ప్రధాని కార్యాలయం దరిదాపుల్లోకి రాకుండా దూరంగానే ఉంచిన ఘనత ఆయనకు మాత్రమే స్వంతం.

1994 లో లోకసభనందు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే సందర్భంగా ఆయన గట్టెక్కేందుకు సభ్యులను ప్రలోభ పెట్టాడనే అభియోగం నుండి చివరికి నిర్దోషిగా బయటపడ్డారు. అంతకు ముందు 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరోధించ లేని పెద్ద వైఫల్యత ఆయన్ను వేలెత్తి చూపడానికి ఉన్న ఒకేఒక్క అవకాశం.

'పీవీ' మన 'ఠీవీ '- news10.app

 

వంగర బిడ్డకు వందనాలు అర్పిస్తూ..

___ గుంటి మనోహర్