తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. జవాబు పత్రాల కోడింగ్ ఇవాళ మొదలైందని.. ఈ నెల 12 నుంచి మూల్యాంకనం ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకనంపై అధికారులతో గురువారం ఆమె సమీక్షించారు. వాయిదా పడిన ఇంటర్ మోడ్రన్ లాంగ్వెజెస్, జాగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మరోవైపు, కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిలిపివేసిన పదోతరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా పదోతరగతి పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అంశంపై కసరత్తు చేసి లాక్డౌన్ అనంతరం నిర్ణయిస్తామని మంత్రి పేర్కొన్నారు.