గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లీకేజీ వర్కుల్లో ఆ ఇద్దరు కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పనుల్లో అనుభవం ఉన్న ఇతర కాంట్రాక్టర్లు కూడా ఆ ఇద్దరి తెలివి ముందు బలాదూరే అనక తప్పదు. ప్రజాప్రతినిధుల అండతో అధికారుల ఆశీర్వాదంతో లీకేజీ వర్కులు దక్కించుకొని వారికి ప్యాకేజీ ముట్టజెప్పుతూ అక్రమ సంపాదనలో దూసుకెళ్తున్నారు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు. ఒకరేమో నగరానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితుడు మరొకరేమో తన బినామిల పేర్లతో టెండర్లు వేసి అధికారులను మచ్చిక చేసుకొని వర్కులు దక్కించుకోవడంలో దిట్ట అనే చెప్పాలి. టెండర్లు లేకుండా ఎమర్జెన్సీ వర్కుల పేర ఇంజినీరింగ్ విభాగ డీఈ, ఏఈ ల సహాయంతో వేల రూపాయల్తో పని పూర్తి చేసి లక్షల్లో బిల్లులు డ్రా చేస్తూ ప్రజా సొమ్ముతో అప్పనంగా తమ జేబులు నిపుకుంటు అనతి కాలంలోనే కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు సమాచారం. టెండర్ లేకుండా వర్కులు తమకు దక్కేలా చక్రం తిప్పిన డీఈ, ఏఈ లకు ఈ ఇద్దరు బాగానే ముడుపులు అందించినట్లు తెలుస్తుంది. పైగా ఈ తతంగం అంతా తెలిసిన ఓ ప్రజాప్రతినిధి వారి అక్రమాలను అరికట్టాల్సింది పోయి వారినుండి పర్సెంటేజి తీసుకుంటూ వారికి అభయహస్తం ఇస్తున్న ట్లు
గుసగుసలు గట్టిగానే వినవస్తున్నాయి. మహా నగరంలో ఉన్నత హోదాలో కొనసాగుతు అధికారులతో ,కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు వర్కులు చేస్తూ ఎంతో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకు దక్కని వర్కులు వీరిద్దరికి ఎలా దక్కుతున్నాయని అని ఇతర కాంట్రాక్టర్లు తెగ బాధపడుతున్నారట.ఇప్పటికి లక్షల్లో బిల్లులు పొందాల్సిన గ్రేటర్ లోని ఇతర కాంట్రాక్టర్లు డబ్బులు రాక సతమతమవుతు సమ్మెకు దిగుతుంటే ఈ ఇద్దరి కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం రోజుల వ్యవధిలోనే రావడం వెనుక ఎవరి హస్తం,ఎవరి ప్రయోజనం ఉందనేది చర్చించుకుంటు మధనపడుతున్నారట….
అంతా వారికి తెలిసే జరుగుతుందా…?
పర్సెంటేజీల మత్తులో సర్కార్ ఖజానాకే గండి కొడుతున్నార…?
జి డబ్ల్యూ యం సి లో కంచే చేను మేస్తుందా…?
వివరాలు మరో సంచికలో