- శాయంపేట లో అక్రమ మొరం దందా…
- అనుమతులు లేకున్నా యదేచ్చగా మొరం తరలింపు.
- ఒక్కరోజులో 20 లక్షల రూపాయల మొరం తరలింపు.
- చీకటి పడితే చాలు అక్రమార్కుల ఇష్టారాజ్యమే…
- కాసుల వర్షం కురిపిస్తున్న మొరం దందా.
- పల్లె నుండి పట్టణాలకు తరలిపోతున్న మొరం.
- అధికారులు పట్టించుకోరు అక్రమార్కులు ఆపరు.
- ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనం.
శాయంపేట మండలంలో అక్రమ మొరం దందా జోరుగా నడుస్తోంది. మండలంలో సహజ వనరులు పుష్కలంగా ఉండడంతో అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది. గుట్టల చుట్టూ ఎక్కడ చూసినా భారీ జెసిబి లతో మొరం తవ్వకాలు చేపడుతున్నారు. అడిగేవారు లేరనే అక్కసుతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చీకటి పడితే చాలు పల్లె నుండి పట్టణాలకు భారీ వాహనాలలో మొరం తరలిపోతున్న స్థానిక అధికారులు మాకేమి పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా యదేచ్చగా అక్రమంగా మొరం తరలించేస్తూ అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో భారీ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సంబంధిత అధికారులు నోరు మెదపడం లేదు.
మండలంలోని వసంతాపూర్ మైలారం సూరంపేట గ్రామాల్లో దేవాదుల సొరంగ మార్గం కోసం రైతుల నుండి భూమి లీజుకు తీసుకున్నారు. దేవాదుల సొరంగ మార్గం పనులు పూర్తయినా వెంటనే సొరంగ మార్గాన్ని లీజుకు తీసుకున్న భూముల్లో నుండి నిలువచేసిన మొరం తో పూడ్చివేయాలి. దేవాదుల సొరంగ మార్గం పనులు మెగా కంపెనీ యాజమాన్యం పనులు పూర్తిచేసిన సొరంగ మార్గాన్ని పూడ్చివేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో లీజుకు తీసుకున్న భూముల్లో డప్పు చేసిన మొరంపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికి రాత్రి భారీ వాహనాలలో అక్రమంగా మొరం తరలిస్తున్నారు.
మెగా కంపెనీకి భూములు లీజుకు ఇచ్చిన రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా దర్జాగా మొరం తరలించేస్తున్నారు. ఒక టిప్పర్ లోడు మట్టికి 15వేల రూపాయల నుండి 10 వేల రూపాయలకు మొరం అమ్మేస్తున్నారు. మైనింగ్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో మొరం దందా జోరుగా కొనసాగుతోంది. రాత్రి నుండి తెల్లవారేసరికి సుమారు 5 నుండి 6 వందల ట్రిప్పుల టిప్పర్ లోడు మట్టిని అమ్మేస్తున్నారు.
ఇటీవల అక్రమార్కులు కొందరు ప్రైవేట్ వ్యక్తులకు,అలాగే సుమారు 6 వందల ట్రాక్టర్ మొరం మండలంలోని రైస్ మిల్లు యజమానికి అమ్ముకున్నట్లు తెలిసింది…సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మండలంలోని పలు గ్రామాల్లో మొరం ధందా కొనసాగుతున్న స్థానిక అధికారులు దున్నపోతు మీద వర్షం పడిన చందంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై మొరం దందా అక్రమార్కులకు ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది. ఈ తతంగమంతా జరుగుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో స్థానిక అధికారులు మైనింగ్ అధికారులు విఫలమయ్యారనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన ఒరవడితో మొరం దందా వ్యాపారమై కాసుల వర్షం కురిపిస్తోంది. శాయంపేట మండలంలోని గుట్టలు సహజ వనరులను అక్రమార్కులు టార్గెట్ చేసి తెల్లారేసరికి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. గత కొద్ది నెలలుగా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా మొరం దందా కొనసాగిస్తున్న ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు అక్రమంగా గుట్టు చప్పుడు కాకుండా మొరం దందా సాఫీగా కొనసాగిస్తున్నారు.