పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం స్కామ్ ఇప్పుడు ఓ భేతాల ప్రశ్నగా మిగిలింది. విజిలెన్స్ విచారణ జరిగిన, స్కామ్ జరిగిందని అధికారుల విచారణలో తేలినా ఇప్పటికి ఉన్నతాధికారులు చర్యలకు వెనుకాడుతున్నారు… ఇది ఇలావుంటే ధాన్యం కొనుగోలులో చేతివాటం చూపించిన హన్మకొండ పౌరసరఫరాల అధికారి, ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, భారీగానే వెనుకేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరు ధాన్యం కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడి డబ్బులు నొక్కేసి ఆస్తులు పెంచుకున్నట్లు ఆ శాఖలో గుసగుసలు బాగానే వినపడుతున్నాయి… ఈ జిల్లాలో పనిచేస్తున్న అధికారి పలివేల్పుల స్కామ్ తర్వాత జనగామ జిల్లా రఘునాధపల్లి మండలంలో 24 ఎకరాల భూమిని మూడున్నర కోట్లు వెచ్చించి తన బంధువుల పేర కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖలో 2008 నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో అధికారిగా కొనసాగుతూ ఒకే చోట పలు హోదాల్లో 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ అధికారి ధాన్యం కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడి దండిగా సంపాదించినట్లు సమాచారం. అంతేకాదు ధాన్యం కొనుగోలు లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి ఉన్నతాధికారులను మ్యానేజ్ చేయడంలో చాలా దిట్ట అని సమాచారం. అందుకే ఎలాంటి భయం లేకుండా అక్రమాలకు పాల్పడుతూ శాఖ పరమైన విషయాలను,విచారణను సైతం చాలా ఈజీగా తీసుకుంటూ మనకేం కాదు ఉన్నతాధికారులు ఉన్నారనే ధీమాలో అధికారి ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖలో ఎఫ్ ఏ సి అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఈ అధికారిని పక్కకు తప్పించడానికి ఉన్నతాధికారులు సైతం ఏమాత్రం ధైర్యం చేయలేకపోతున్నారని తెలుస్తోంది.
చర్యలు శూన్యమే …?
పలివేల్పుల ధాన్యం కొనుగోలు స్కామ్ ఎపిసోడ్ ను అంతా గమనిస్తుంటే “తిలా పాపం తలా పిడికెడు” అన్న చందంగా కనిపిస్తుంది ఈ స్కామ్ లో కింది నుంచి పైదాక అందరి పాత్ర ఉన్నట్లు అనుమానం కలుగుతోంది… అందుకే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగులు కేంద్రంలో స్కామ్ జరిగిన కోటికి పైగా డబ్బులు హం ఫట్ అయిపోయిన ఇప్పటికి ఈ విషయంలో చర్యలు లేవు ఉలుకు లేదు పలుకు లేదు… విచారణ నివేదిక పంపించాము అంటారు తప్ప చర్యల విషయంలో మాత్రం ఆ ఒక్కటి అడగద్దు అన్నట్లు ఉన్నతాధికారుల తీరు కనపడుతుంది. విజిలెన్స్ నివేదిక స్కామ్ జరిగినట్లు తేల్చిన అందులో పాత్ర ఉన్న అధికారి పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో వారికే తెలియాలి. స్కామ్ లు చేసి సర్కార్ సొమ్ము అప్పనంగా నొక్కేసిన అధికారులపై ఉన్నతాధికారులు అంతటి ప్రేమను ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదు.
అవును ఆ మిల్లు అంతే….?
పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం స్కామ్ లో వరంగల్ నగర శివారులోని వజ్రకవచ మిల్లు ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారుల, విజిలెన్స్ విచారణలో తేలినట్లు తెలిసింది. ధాన్యం డబ్బులు అప్పనంగా నొక్కేయడంలో ప్రధానపాత్ర ఆ మిల్లుదేనని తేలిందట. ఈ మిల్లు ఇప్పుడే కాదు ఆ అధికారి తో కలిసి కొన్ని సంవత్సరాలుగా ధాన్యం డబ్బులు నొక్కేసే స్కామ్ లో భాగం పంచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ధాన్యం విషయంలో ఈ మిల్లు యాజమాన్యం తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరించిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారట. స్కామ్ జరిగిందని తెలిసిన మిల్లు పాత్ర ఉన్నట్లు తేలిన ఆ మిల్లును బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా, మింగిన డబ్బులను కక్కించకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా అధికారులు వేడుక చూస్తున్నారని ఇదంతా ఆ అధికారి చలువేనని విశ్వసనీయ సమాచారం.. ఇలా అధికారుల సహకారంతో ఈ మిల్లు యజమాని కోట్ల రూపాయలు వెనకేసినట్లు జోరుగా ఆరోపణలు వినవస్తున్నాయి….