గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని 494 సర్వే నంబర్ లో గల ఎకరం 10 గుంటల ప్రభుత్వ అసైన్డ్ భూమిని కాటన్ మిల్లు యాజమాన్యం తన మిల్లు భూమిలో కలుపుకొని ప్రహారి నిర్మించి మొత్తం భూమినే కాజేయాలని చూస్తే జూన్ మాసంలో న్యూస్10 ఆ భూమి కబ్జా పై వరస కథనాలు వెలువరించగా రెవెన్యూ అధికారులు అది అసైన్డ్ భూమిగా తేల్చి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.ఇది ప్రభుత్వ భూమి అని తెలుపుతూ సూచికను సైతం ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నా ఎకరం పదిగుంటల భూమికి మిల్లు యజమాని నిర్మించిన ప్రహారిని మాత్రం కూల్చివేసేందుకు అధికారులు ఎందుకో వెనకాడుతున్నారు. జూన్ మాసంలో అసైన్డ్ భూమి కబ్జా విషయం న్యూస్10 వెలుగులోకి తీసుకురాగా నవంబర్ మాసంలో ఇదే ప్రభుత్వ భూమి అని తేల్చి ప్రహారి గోడ వెలుపల సూచిక ఏర్పాటు చేసిన అధికారులు నెలకు పైగా గడుస్తున్నా ఇప్పటికి ఆ ప్రహారి గోడను కూల్చి వేసే సాహసం చేయలేదు.కలెక్టర్ ఆదేశాలు ఇస్తే తప్ప తాము కూల్చలేమంటున్న రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని ఇప్పటివరకు అసలు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారో లేదో తెలియదు.
భూమి సొంతం కోసం ప్రయత్నాలు…?
మొన్నటివరకు ఎకరం పది గుంటల అసైన్డ్ భూమిని తన ఆధీనంలో ఉంచుకొని కాటన్ మిల్లు నిర్వహించిన ఆ మిల్లు యజమాని ఇంతజరిగిన ఆ భూమి అసైన్డ్ సర్కారుదే అని రెవెన్యూ అధికారులు తేల్చిన ఆ భూమిని తన హస్తగతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. టీ ఎస్ ఐ పాస్ పేరిట ఎదో సాకు చూపి కోట్ల రూపాయల విలువ చేసే సర్కార్ భూమిని అప్పనంగా కొట్టేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదకుపెట్టినట్లు సమాచారం… ఈ భూమిని ఎలాగైనా తన సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులను ఆశ్రయించిన మిల్లు యజమాని పైరవీలు బాగానే చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ అధికారులు,ప్రజాప్రతినిధుల సాయంతో భూమిని కాటన్ మిల్లుకే దక్కేలా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలియవచ్చింది.అందుకే భూమి అసైన్డ్, సర్కారుదే అని తేల్చిన జిల్లా అధికారులు ఆ భూమిలో నిర్మించిన ప్రహారి గోడను కూల్చేందుకు వెనుకాడుతున్నారని ప్రచారం జరుగుతోంది… ఈ భూమి ప్రభుత్వ పరం కాకుండా ఓ ఎమ్మెల్యే, మంత్రి మిల్లు యజమానికి సహకరిస్తూ భూమిని ఎలాగైనా కాటన్ మిల్లు యజమానికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపణలు జోరుగా వినవస్తున్నాయి. వీరిద్దరి జోక్యం కారణంగానే విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూమి స్వాధీనం చేసుకొని ప్రహారి కూల్చడానికి జిల్లా ఉన్నతాధికారులు సైతం వెనకడుగు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకముందే ఇకనైనా అధికారులు కాటన్ మిల్లు ప్రహారి ని కూల్చి అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకుంటారా…లేక ప్రజాప్రతినిధుల పైరవీలకు తలోగ్గుతారా….? చూడాలి.