‘నాగుర్ల’కేది అవకాశం….?

టీఆర్ఎస్ ఏర్పడిన దగ్గరనుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు అటు పార్టీలో ఇటు ఉద్యమంలో కీలకంగా వ్యవరించిన ఉద్యమకారులు, నామినేటెడ్ పదవులకోసం ఓపికగా ఎదురు చూస్తున్నారు. రేపో మాపో అవకాశం రాకపోతుందా… అని అధిష్టాన నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. అలాంటి నాయకులు వరంగల్ ఉమ్మడిజిల్లాలో చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో నాగుర్ల ఒక్కరు… ఒక్కోసారి అవకాశాలు వచ్చిన అధిష్టానం నిర్ణయంతో అవకాశాన్ని వదులుకున్న ఆయన ఈసారి నామినేటెడ్ పదవికోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

'నాగుర్ల'కేది అవకాశం....?- news10.app

వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ సీనియర్ నేతగా కొనసాగుతూ ఉద్యమ సమయం నుంచి చురుకుగా ఉంటున్న నాగుర్ల వెంకటేశ్వర్లు గులాబీ పార్టీలో అవకాశం కోసం ఓపికగా ఎదురు చూస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలకు ఇప్పటివరకు కట్టుబడి ఉన్న ఆయన ఈసారి తనకు ఎమ్మెల్సి పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నట్టు తెలిసింది. గవర్నర్ కోటాలో అధిష్టానం ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వగా… ఈసారి తనకు ఈ కోటాలో తప్పక ఎమ్మెల్సీ దక్కుతుందనే ధీమాతో నాగుర్ల ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకుగాను తనవంతు ప్రయత్నాలు అధిష్టానం వద్ద కొనసాగిస్తున్న నాగుర్ల తనపట్ల గులాబీ అధిష్టానం సానుకూలంగానే ఉన్నట్లు తన సన్నిహితులకు చెప్పారట.

అవకాశాలు వచ్చినా….

నాగుర్ల వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతున్న దగ్గరి నుంచి పరకాల, భూపాలపల్లి నియజకవర్గాల్లో చురుకుగా పనిచేశారు. ఈ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఇక్కడ పాలోవర్స్ కూడా ఉన్నారు. 2006 నుంచి 2009 వరకు జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ గా కొనసాగిన ఆయన కొన్ని సమీకరణలు నేపథ్యం, అధిష్టానం నిర్ణయం మూలంగా 2014 లో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అధిష్టానం నచ్చజెప్పడంతో ఊరుకున్నారు. ఇదే సంవత్సరం భూపాలపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగుర్లను ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా సీఎం హామీ నెరవేరలేదు… కానీ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పట్లో దానికి చట్టబద్దత లేదనే విమర్శలు రావడంతో ఆ పదవి నాగుర్లకు పేరుకే మిగిలిపోయింది.

మరోవైపు ఇటీవల జరిగిన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాగుర్ల మేయర్ గా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగి, అధిష్టానం కూడా ఒకే చెప్పిన చివరి నిమిషంలో నాగుర్లను తప్పించారు. ఇక్కడ కూడా నాగుర్ల పార్టీ అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. ఈ విధేయత తనకు కలిసి వస్తుందని భావిస్తున్న నాగుర్ల ప్రస్తుతం ఎమ్మెల్సీ కోసం గట్టి ప్రయత్నమే చేస్తుండగా పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నాగుర్ల కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన నాగుర్ల పార్టీ ఆదేశాల మేరకు తనవంతు కృషి చేస్తున్నాడని పార్టీ అధిష్టానం తనను గుర్తించాలని వారు కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను కాపాడుకున్న నాగుర్ల కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీ మరింతగా బలపడే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈసారయిన సీఎం ఇచ్చిన హామీ నెరవేరుతుందా… అని వారు ఎదురుచూస్తున్నారు. మరి నాగుర్ల విషయంలో గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.