గులాబీ పార్టీలో ఈటల రాజేందర్ కథ ఇక ముగిసినట్లేనా… పొమ్మనలేక గులాబీ అధిష్టానం పొగ పెడుతుందా…? భూవివాదాలను తెరపైకి తెచ్చి ఇటలను మంత్రి పదవినుంచి తొలగించి పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నం చేస్తున్నారా…? అంటే అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తుంది… ఈటల భూకబ్జా విషయం పక్కన ఉంచితే సరిగ్గా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ అధికారిక చానల్ లో ఇతర మీడియా ఛానల్లో ఈటల భూకబ్జా వ్యవహారంపై వార్తలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది… శుక్రవారం నుంచి రాజకీయ వర్గాల్లో ఈటల టాపిక్ హాట్ టాపిక్ గా మారింది… ఆ వెంటనే రకరకాల పరిణామాలు చోటుచేసుకున్నాయి… ముఖ్యమంత్రి సమగ్ర విచారణకు ఆదేశించడం… కలెక్టర్ శనివారం ఉదయం భూమి దగ్గరకు వెళ్లి విచారణ చేసి అసైన్డ్ భూమి కబ్జా జరిగిందని నివేదిక ఇవ్వడం,ఈటల రాజేందర్ శాఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి గవర్నర్ కు సిపార్స్ చేయడం, దానిని గవర్నర్ ఆమోదించడం… వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి పరిధిలోకి వెళ్లడం లాంటి పరిణామాలు చాలా వేగంగా కొనసాగాయి.
ధిక్కార స్వరానికి దిక్కెవరు…?
ఈటల రాజేందర్ గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ వెన్నంటి ఉన్నారు… పార్టీ స్థాపన నుంచి తెలంగాణ ఉద్యమం కాలం, టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి రావడం లో ఈటల తన వంతు పాత్రను పోషించారనేది నిజం… కానీ రెండో సారి గులాబీ అధికారం లోకి రాగానే ఈటల కు మంత్రి పదవి విషయంలో కాస్త కష్టమే కలిగింది… ఎలాగో మంత్రి పదవి దక్కిన ఈటల అసంతృప్తిగానే పదవి నిర్వహిస్తువచ్చారు… ఛాన్స్ దొరికినప్పుడల్లా సొంత పార్టీ,ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తూ సర్కార్ ను ఇరుకున పెట్టె పని చేస్తూ… తన ధిక్కార స్వరాన్ని పార్టీ అధినేతకు వినిపిస్తు వచ్చారు… దింతో ఈటల ధిక్కార స్వరానికి చెక్ పెట్టాలని కొన్ని సార్లు ముఖ్యమంత్రి స్వయంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి… ఇదంతా ఇలా ఉంటే ఇన్ని రోజులు ధిక్కార స్వరాన్ని వినిపించి మంత్రి పదవినుంచి ఉద్వాసనకు గురై, పార్టీ కి రాజీనామా చేస్తే ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో ధిక్కార స్వరమైన ఈటల కు దిక్కెవరనేది ప్రశ్న…. కొన్ని రోజులు ఈటల కు అనుకూలంగా మాట్లడినట్లై మాట్లాడి రాజకీయ భవిష్యత్ అంటూ రంగులు మార్చే నాయకులతో ఈటల రాజకీయ భవిష్యత్ ఎలా… అనేదే ప్రశ్న… ఇన్ని సంవత్సరాలు గులాబీ పార్టీలో కొనసాగిన ఆ పార్టీలో ఏ నాయకుని నుంచి కనీస నైతిక మద్దతు లేకుండా ప్రస్తుతం ఈటల గులాబీ పార్టీలో ఏకాకిగా మిగిలారనేది నిజం…ఇంత ఎపిసోడ్ జరుగుతున్న పార్టీలో ఈటల సమకాలికులు సైతం నోరు విప్పలేదు… మంత్రులు సైతం లోలోపల ఎం అనుకున్నారో తెలియదు కాని బయట ఈ విషయం పై మాట్లాడడానికే నిరాకరిస్తున్నారు… ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా అధినేత ఆదేశాలతో వారు సైతం నోటికి తాళం వేసుకున్నారు… ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఈటల అభిమానులు, అనుచరులు కాదన్న ప్రస్తుతానికి మాత్రం టీఆర్ఎస్ లో ఆయన ఏకాకి అనే మాట ముమ్మాటికీ నిజం… ఈటల వినిపించిన ధిక్కార స్వరమే ఆయనకు శాపంగా మారిందనేది ఈటల శిబిరం గుర్తించాల్సిన వాస్తవం.
బిసి సంఘాలు ఎం చేస్తాయి…?
కేసీఆర్ మంత్రి వర్గంలో ఓ బిసి మంత్రికి విలువ లేకుండా పోయింది… అవమానిస్తున్నారని రెండోసారి ఈటల మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి బిసి సంఘాలు అప్పుడప్పుడు తమ గళాన్ని వినిపించాయి… ఇప్పుడు ఈటల మంత్రి పదవికి గండం వచ్చి, పార్టీ లోనే ఆపద వస్తే బిసి సంఘాలు ఆందోళన చేస్తాయా…? ప్రభుత్వం దిగివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తాయ… అంటే ఇది నిజానికి సమాదానం దొరకని ప్రశ్నే… సంఘాలన్నీ ఎక్కడికక్కడ అధికార పార్టీ అనుకూల, వ్యతిరేక సంఘాలుగా చీలిపోగా వీరిలో రాత్రికిరాత్రే ఐక్యత రావడం ఈటల కు అనుకూల స్వరం వినిపించడం అసాధ్యమే. అక్కడక్కడ సంఘాలు చిన్న చిన్న కార్యక్రమాల రూపంలో నిరసన తెలిపిన ఆ నిరసనల సెగ అధిష్టానాన్ని తాకేంతగా ఉండదనేది నిజం… గులాబీ పార్టీలో ఉన్న బీసి నాయకులు, ఈటల కు అనుకూల గళాన్ని వినిపిస్తారా…? అంటే అది జరిగేలా లేదు… ఇప్పటికే ఈటల అనుకులురు ఎవరు అనేదానిపై ఇంటెలిజెన్స్ ద్వారా కేసీఆర్ నివేదిక తెప్పించుకుని వారిని గులాబీ దారికి ఎప్పుడో తెచ్చారని విశ్వసనీయ సమాచారం… దింతో ఆ బీసీ నేతలు సైతం మాకెందుకొచ్చింది అని గమ్మున ఉంటారనేది గులాబీలో టాక్ అంటే ఈటల ను సాగనంపేందుకు అధిష్టానం అష్ట దిగ్బంధనం చేసి… ఎలాంటి మద్దతు ఎక్కడ నుంచి దొరకకుండా పార్టీలో సైతం ఒంటరిని చేసి ఉద్వాసనకు రంగం సిద్ధం చేసిందనేది సుస్పష్టం…
ప్రతిపక్షాల పాత్ర ఏంటి…?
ఇక ఈటల రాజేందర్ వ్యవహారంలో విషయంలో ఈ వ్యవహారం తమకు ఎక్కడ అనుకూలంగా మారుతుందని చూస్తున్నాయి తప్ప ఈటల కు సాయం చేద్దామనో… సహకరిస్తామనో చూడడం లేదు… ఇది రాజకీయాల్లో సాధారణమే ఐయిన.. కొందరు ఈటల పై సానుభూతిని చూపుతూనే మిగతవారి సంగతి ఏంటని ఈటల విషయాన్ని ఆధారం చేసుకుని సర్కార్ ను ఇరుకున పెట్టె పనిచేస్తున్నారు… సరిగ్గా ఇలాంటి పనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేశారు… మిగతా మంత్రుల కబ్జాలు, ఎమ్మెల్యే ల కబ్జాలు ఇస్తాం చర్యలు తీసుకోవాలని సీఎం కు సవాల్ విసిరారు… రెండు పార్టీలు అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ ఈటల ఎపిసోడ్ ద్వారా మైలేజ్ ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు…. అవసరమైతే ఈటల గులాబీని విడితే తమ పార్టీ తీర్థం పోద్దామని చూస్తున్నారు… అంతే తప్ప ఈటల కు బాసటగా నిలుద్దామని కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది కేవలం సర్కార్ పై ప్రతిపక్షాల కోపం తప్ప ఈటల అనుకూల స్వరం కాదనేది నిజమంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు కబ్జా అవమానంపై ఈటల ఎం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది…ఇప్పటికిప్పుడు ఈటల కొత్త పార్టీ పెడతాడా… అనే ప్రచారం కూడా సాగుతుంది… జెండా… పార్టీ పాటలు అప్పుడే సిద్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం సైతం జరుగుతుంది.
కొత్త నేతలు దొరికారా…?
ఈటల రాజేందర్ పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ నియోజకవర్గంలో గులాబీకి ఓ ఇద్దరు కొత్త నేతలు దొరికారనే ప్రచారం జరుగుతోంది… మాజీ మంత్రి బిజెపి నేత పెద్దిరెడ్డి, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి త్వరలోనే గులాబీ లో చేరనున్నారని ప్రచారం అక్కడ ఊపందుకుంది… అందుకే కేసీఆర్ ఈటల పై ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం… రేండు రోజుల క్రితం పెద్ది రెడ్డి కేసీఆర్ తో మాట్లాడినట్లు హుజురాబాద్ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది… ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నింటికి ఈటల రాజేందర్ ఎలాంటి సమాధానం చెప్తారో… తన భవిష్యత్ కార్యాచరణను ఎలా ముందుకుతీసుకు పోతారో వేచిచూడాలి.