కరోనా మూలంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్ లకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం అవుతున్న వీరి లాగే ఉద్యోగం లేక తిప్పలు పడుతున్న ప్రయివేటు లెక్చరర్స్, విద్యా వాలంటీర్ లను సైతం ఆర్థికంగా ఆదుకోవాలనే డిమాండ్ లు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రయివేటు టీచర్ లను ఆదుకోవడానికి ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం కొన్ని విధివిధానాలను సైతం జారీచేసింది. యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేస్తున్న టీచర్ ల వివరాలను ఇవ్వాలని కోరింది ఐయితే కొన్ని కారణాల మూలంగా యాజమాన్యాలు సరైన నివేదికను అందిస్తాయా అనే అనుమానాలు మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు ఉండగా విద్యాశాఖ నుంచి మాత్రం 1.18 టీచర్ లు మాత్రమే ఉన్నట్లు లెక్క తేల్చినట్లు తెలిసింది. దింతో మిగతా టీచర్ ల పరిస్థితీ ఏంటని వీరిలో ఆందోళన మొదలయింది. కరోనా ఎఫెక్ట్ తో అత్యంత తీవ్రంగా నష్టపోయిన వారిలో ప్రైవేటు టీచర్లు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తు, ఆత్మగౌరవంతో జీవిస్తున్న వారిని ఈ మహమ్మారి రోడ్డు మీదకు తెచ్చింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూయడం ఇందుకు కారణమైంది. అనేక పాఠశాలలు స్కూళ్లు నడవడం లేదన్న కారణంతో ఉపాధ్యాయులను, సిబ్బందిని విధుల నుంచి తొలగించాయి. అయితే ప్రైవేటు టీచర్ల ఇబ్బందులపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. వారికి తిరిగి పాఠశాలలు ప్రారంభించేవరకు నెలకు రూ. 2 వేలతో పాటు 25 కేజీల బియ్యం అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. కరోనా కంటే ప్రారంభానికి ముందు అంటే మార్చి 2020కి ముందు పని చేసిన వారినే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది. తొలగింపునకు గురైన టీచర్లకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం దాదాపు 11 వేల పాఠశాలలు ఉన్నాయి. వారిలో దాదాపు 1.18 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నారని ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు చెబుతున్నాయి.
జాబితా ఇలా..
ఉపాధ్యాయులు ప్రభుత్వం అందించే సాయం విషయంలో ఆయా ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు ప్రధాన పాత్ర పోషించనున్నారు. వారు తమ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది జాబితాను విద్యాశాఖ సూచించిన ఫార్మాట్లో నింపి మండల విధ్యాధికారికి అందించాల్సి ఉంటుంది. అప్లికేషన్లో రెండు పార్టులు ఉంటాయి. పార్ట్ ఏలో సిబ్బంది లేదా టీచర్ ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఆధర్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్, ఆహార భద్రత కార్డు నంబర్, వారి రేషన్ షాపు వివరాలను ఆయా టీచర్ లేదా సిబ్బంది నింపి సంతకం చేయాల్సి ఉంటుంది. పార్ట్ బీ లో హెచ్ఎం పాఠశాలకు సంబంధించిన వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎంఈవో లేదా కలెక్టర్ నియమించిన అధికారి పరిశీలించాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పరిధిలో పని చేసే సిబ్బందికి కూడా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వారందరికీ అన్యాయమేనా?
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,763 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉపాధ్యాయులు 1.18 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు ఉంది. 20 కన్నా ఎక్కువ మంది సిబ్బంది పని చేస్తూ ఉంటే ఆయా యాజమాన్యాలు తమ వాటాగా పీఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందు నుంచి తప్పించుకోవడానికి అనేక పాఠశాలలు తమ వద్ద తక్కువ మంది పని చేస్తున్నట్లు ప్రభుత్వాలకు లెక్కలు ఇస్తుంటాయి. దీంతో ఇప్పుడు అధికారిక లెక్కల్లో లేని వారు ప్రభుత్వం అందించే సాయానికి అనర్హత పొందే ప్రమాదం ఏర్పడింది. దింతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తూ యాజమాన్యాల మూలంగా అధికారిక లెక్కల్లో లేకుండా ఉన్నవారి పరిస్థితీ ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి… విద్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తే బాగుంటుందని కొందరు అంటున్న యాజమాన్యాలు సహకరించకుండా ఇది ఎలా సాధ్యం అవుతుందనే అనుమానం సైతం లేకపోలేదు. దీని మూలంగా జాబితాలో పేర్లు లేనివారు,సాయం అందని వారు, సాయం కోసం ధరకాస్తూ చేసుకోవడానికి యాజమాన్యాల నుంచి సరైన ఆధారాలు లబించని వారు అధికారులకు పిర్యాదు చేసే అవకాశం ఉంది. దింతో ఇన్నాళ్లు ప్రైవేటు యాజమాన్యాలు ఎంతమంది ఉద్యోగుల వివరాలు గోప్యంగా ఉంచాయో బయటపడేలా ఉంది.
మా పరిస్థితి ఏంటి?
కరోనా కారణంగా అనేక ప్రైవేటు కళాశాలలు తమ సిబ్బందిని తొలగించాయి. కొద్ది మంది లెక్చరర్లతో ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్నాయి. దీంతో అనేక మంది ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారు కూడా తమకు ప్రభుత్వ సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు కరోనా ప్రారంభం నాటికి రాష్ట్రంలో దాదాపు 13 వేల మంది విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా వారిని ఈ ఏడాది విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారు కూడా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. తమకు కూడా ప్రభుత్వ సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు లెక్చరర్లు, విద్యావాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.