తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అట్టహాసంగా కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని దృఢమైన సంకల్పం తో మిషన్ భగీరథ చేపట్టింది. కానీ అందుకు విరుద్ధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు అందించడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి ట్రయల్ చేయకుండానే కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. శాయంపేట మండలం లోని ప్రగతి సింగారం గ్రామంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా గ్రామంలో నల్లా కనెక్షన్లు ఇచ్చి నాలుగు నెలలుగా చుక్క నీరు కూడా అందించని దుర్భరమైన పరిస్థితి దాపురించింది. వేసవి కాలం సమీపించి ఎండలు తీవ్రమవుతున్న త్రాగు నీటి ఎద్దడి సమస్య పరిష్కారం దిశగా ప్రజా ప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. నల్లా కనెక్షన్లు ఇచ్చిన నాటి నుండి నేటి వరకు సంబంధిత అధికారులు తొంగిచూసిన పాపాన పోలేదు. మిషన్ భగీరథ అధికారులు ప్రగతి సింగారం గ్రామంలో త్రాగునీరు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వం అంత ఖర్చు చేసి పనులన్నీ పూర్తి చేయించిన ట్రయల్ రన్ నిర్వహించి ఇంటింటికి నీళ్లు అందించడానికి అధికారులకు ఏమాత్రం తీరికలేనట్లు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నల్లా కనెక్షన్ ఇచ్చి నాలుగు నెలలైనా చుక్క నీరు అందని వైనం……
శాయంపేట మండలం లోని ప్రగతి సింగారం గ్రామంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చి నాలుగు నెలలు గడిచిన ఇప్పటివరకు గ్రామంలో మిషన్ భగీరథ నీరు అందించకపోవడం అధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారింది. అయితే మిషన్ భగీరథ అధికారులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. 4 నెలల క్రితం నల్లా కనెక్షన్లు ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించకుండా ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
త్రాగు నీటి కోసం తప్పని తిప్పలు…..
ప్రగతి సింగారం గ్రామంలో త్రాగు నీటి కోసం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ల ద్వారా ఐదు రూపాయలకు వీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం రికార్డుల కే పరిమితమై పోయిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మరో వైపు మిషన్ భగీరథ నీళ్లు గ్రామస్తుల గొంతు తడపకున్న గ్రామపంచాయతి అందించే నీటితో దాహం తీర్చుకుందామంటే అది సరిగా లేదని తెలుస్తోంది. గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన త్రాగు నీటిని సరఫరా చేయాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బంది క్లోరినేషన్ చేయడం లేదని, ట్యాంకులు నిండి రోజుల తరబడి నీరు వృధాగా పోతున్న ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే నేటి వరకు మిషన్ భగీరథ నీరు అందలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ లేని అధికారులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు…..
ప్రగతి సింగారం గ్రామంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇచ్చి నాలుగు నెలలు గడిచిన నేటికి గ్రామస్తులకు నీరు అందించకపోవడం వల్ల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీరు అందరికీ సరఫరా అవుతుందా లేదా అనేదానిపై పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో ప్రతి రోజు మిషన్ భగీరథ నీరు అందించాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, సిబ్బంది పట్టించుకోవడంలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు మిషన్ భగీరథ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగు నీటిని సరఫరా చేయడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని వారు అంటున్నారు. ఇకనైనా అన్ని పనులు పూర్తయని అందకుండా ఉన్న భగీరథ నీటిని గ్రామ ప్రజలకు అందించి వారి దాహార్తిని తీర్చాలని పలువురు కోరుతున్నారు.