పత్తిపాక క్రషర్… పరేషాని చేస్తోంది….!

ఇంతకు మైనింగ్ అధికారులు… ఉన్నట్టా….లేనట్టా?
భారీ బ్లాస్టింగ్ లతో ప్రజలు తల్లడిల్లుతున్న ఏమాత్రం చలనం లేని మైనింగ్ అధికారులు
పతిపాక లో ఇష్టారాజ్యంగా భారీ బోర్ బ్లాస్టింగ్ లు
క్రషర్ ఆవరణలో ఓ గదిలో భారీగా అనుమతిలేని మందుగుండు సామగ్రి నిల్వ…?
భారీ పేలుళ్ల తో పగుళ్ళ బారిన పడుతున్న ఇండ్లు
ఆందోళనలో పత్తిపాక,శాయంపేట గ్రామాల ప్రజలు
పిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు

అక్కడ గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఓ క్రషర్ మూలంగా రెండు గ్రామాల శివారు ప్రజలతో సహా వ్యవసాయదారులు ఇబ్బందులు పడుతున్నారు.సాయంత్రం ఐయిందంటే చాలు క్రషర్ నిర్వహిస్తున్న ప్రాంతం చుట్టూపక్కల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాలి…. భారీ బోర్ బ్లాస్టింగ్ జరుగుతుందని క్రషర్ లో పనిచేసే సిబ్బంది బ్లాస్టింగ్…. అంటూ అరుస్తూ.. కిలోమీటర్ల కొద్దీ తిరుగుతూ అలెర్ట్ చేస్తుంటారు… అంటే ఏ స్థాయిలో యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లకు పాల్పడుతుందో అర్థం అవుతుంది….ఇవన్నీ ఎలాంటి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఏ అధికారి ఆ క్రషర్ వైపు కన్నెత్తి చూడడు… క్రషర్, డాంబర్ ప్లాంట్ పేరుతో అక్కడ ఓ సామ్రాజ్యం వెలిసిన ఎవరికి ఎంతమాత్రం పట్టదు…. టన్నుల కొద్దీ పేలుడు సామాగ్రి దొడ్డి దారిన క్రషర్ అవరణలోని గదిలో రహస్యంగా దాచిఉంచి బ్లాస్టింగ్ లు చేస్తున్న ఏ అధికారికి అసలే తెలియదు… దీనికంతటికీ కారణాలు ఏవి ఉన్న ఈ క్రషర్ మూలంగా మాత్రం జనం అనేక పాట్లు పడుతున్నారు… ఒక్కసారి బ్లాస్టింగ్ జరిపితే వచ్చే శబ్దం కనీసం నాలుగు కిలోమీటర్ల మేర వినిపించి ఉలిక్కి పడేలా చేస్తుందంటే అది ఎంతటి తీవ్రతో అర్థం చేసుకోవచ్చు… ఈ శబ్దం స్థానిక అధికారుల కార్యాలయాలవరకు వినిపించిన అదేంటనే వాకబు చేసి చర్యలు తీసుకునే స్థితిలో అధికారులు లేరంటే ప్రజలు వీరిపై చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తుంది పూర్తి వివరాల్లోకి వెళితే…..

పత్తిపాక క్రషర్... పరేషాని చేస్తోంది....!- news10.app

ఇది బ్లాస్టింగ్ కహానీ

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం లోని పత్తిపాక గ్రామంలో ఉన్న ఓ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీ బోర్ బ్లాస్టింగ్ లకు చేస్తుండడం వల్ల శాయంపేట, పత్తిపాక గ్రామాల ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. సాయంత్రం అయితే రెండు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో క్రషర్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా బోరు బ్లాస్టింగ్ లు జరపడం వల్ల ఇరు గ్రామాల్లో ని ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని ప్రజలు వాపోతున్నారు. భారీ బోర్ బ్లాస్టింగ్ పేలుళ్ల కారణంగా ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న పశువులు సైతం తాళ్ళు తెంపుకుని పరుగులు తీస్తున్నాయని, అయితే క్రషర్ యాజమాన్యం తీరుపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదని కనీసం విచారణ కూడా చేపట్టలేదని అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు.

ఇష్టారాజ్యంగా బోర్ బ్లాస్టింగ్ లు

శాయంపేట మండల కేంద్రంలోని పత్తిపాక గ్రామంలో ఉన్న స్టోన్ క్రషర్ యాజమాన్యం పేలుస్తున్న భారీ బోర్ బ్లాస్టింగ్ ల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రిల్ మిషన్ తో రంధ్రాలు చేయాలి. అలా కాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసే పరికరాలతో బండకు 300 నుండి 400 ఫీట్ల వరకు రంధ్రాలు చేసి అందులో పేలుడు పదార్థాలు నింపి భారీ స్థాయిలో క్రషర్ యాజమాన్యం బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్నారు. పేలుళ్ల వల్ల సమీపంలో ఉన్న ఇండ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

పగుళ్ళ బారినపడ్డ ఇండ్లు

శాయంపేట పత్తిపాక గ్రామాల్లో భారీ బోర్ బ్లాస్టింగ్ కారణంగా ఇండ్లు పగుళ్ల బారిన పడ్డాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము వేసుకున్న రేకుల షెడ్లు, స్లాబు గోడలు బీటలు వారి పోతున్నాయని, భారీ బోర్ బ్లాస్టింగ్ అయిన తర్వాత క వచ్చే దుర్వాసన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. కొద్ది సంవత్సరాలుగా ఈ తతంగమంతా జరుగుతున్న అధికారులు మాత్రం దేనిమిదనో వర్షం పడిన చందంగా గ్రామాల ప్రజల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

ఆందోళనలో రెండు గ్రామాల ప్రజలు.

పత్తిపాక గ్రామంలో ఉన్న స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా రెండు గ్రామాల ప్రజలు ఆస్తి నష్టం జరిగి ఇబ్బందుల పాలవుతున్నారు. ఒకవైపు వారి బోర్ బ్లాస్టింగ్ లు మరోవైపు డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడే దుర్వాసన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య పరిస్థితులు ఎదురైతే తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . అధికారులు స్పందించి క్రషర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజలకు నష్టం జరిగే పనులను నిలిపివేయాలని కోరుకుంటున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు.

పత్తిపాక గ్రామ శివారులో గల బోడబండ ప్రాంతంలో నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్ యాజమాన్యం 11 సంవత్సరాలుగా సహజ వనరులను దోపిడీ చేస్తున్న….. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీబోర్ బ్లాస్టింగ్ లకు పాల్పడుతున్న, స్థానిక, సంబంధిత అధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అయితే బోర్ బ్లాస్టింగ్ ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానిక అధికారులకు ఫిర్యాదు వచ్చిన నేటి వరకు కనీసం ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం అధికారుల తీరుపై బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోరు బ్లాస్టింగ్ ల వల్ల పంట నష్టం, ఆస్తి నష్టం పై అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

బోర్ బ్లాస్టింగ్ లపై ఫిర్యాదులు

పత్తిపాక గ్రామంలోని బోడబండ ప్రాంతంలో యాజమాన్యం నిర్వహిస్తున్న బోర్ బ్లాస్టింగ్ ల పై స్థానిక అధికారులకు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్, పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు, గనులు మరియు భూగర్భ జలవనరుల శాఖ, గనులు మరియు భద్రత డైరెక్టర్ జనరల్ అధికారి (సెంట్రల్ గవర్నమెంట్) హైదరాబాద్, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా భారీ బోర్ బ్లాస్టింగ్ లపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

అధికారులకు పట్టింపే లేదు… – మారేపల్లి మనోజ్ కుమార్

మండల స్థాయి అధికారుల నుండి ఇ రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికుడు మారేపల్లి మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే బోర్ బ్లాస్టింగ్ లపై మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు అందజేయనున్నట్లు తెలిపారు.

భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి – మారేపల్లి సునీల్

పత్తిపాక గ్రామంలోని స్టోన్ క్రషర్స్ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా బోర్ బ్లాస్టింగ్ లు జరపడం వల్ల సమీపంలో ఉన్న వ్యవసాయ బావులలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పంటలకు రావాల్సిన నీరు ఒకే పంటకు కూడా సరిగా అందడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ చిందరవందర – పెండెల కుమార్

సాయంత్రం పూట నిర్వహించే బోర్ బ్లాస్టింగ్ ల వల్ల ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కిందపడిపోయి ధ్వంసమవుతున్నాయి. కాలనీలో ఉన్న చేత బావులలో కూడా నీరు అడుగంటి పోవడం వల్ల నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంటి వద్ద నల్ల కోసం ఏర్పాటు చేసుకున్న ఓడలు పెచ్చులు ఊడి పోతున్నాయి. కరెంటు బల్బులు, టీవీలు కాలిపోతున్నాయి .అధికారులు సమస్య ఉందని తెలిసిన పట్టించుకోవడంలేదు.