దేశంలో స్కూళ్లు, కాలేజీలు ఇతర విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఈ నెల 14 తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ముగియగానే కరోనా వైరస్ స్థితిగతులపై సమీక్ష జరుగుతుందని, ఆ సమీక్షలో తీసుకునే నిర్ణయం ఆధారంగానే విద్యాసంస్థల పునఃప్రారంభం ఎప్పుడు అనే విషయం కూడా నిర్ణయిస్తామని హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చదువు కంటే దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రధానమని పోఖ్రియాల్ చెప్పారు. ఒకవేళ ఏప్రిల్ 14 తర్వాత కూడా విద్యాసంస్థలను తెరువడం సాధ్యం కాకపోయినా.. విద్యార్థులకు మాత్రం ఎలాంటి నష్టం జరుగనివ్వబోమని ఆయన హామీ ఇచ్చారు. లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత మిగిలిన పరీక్షలను పూర్తి చేయించి, ఎవాల్యుయేషన్ కొనసాగించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి పోఖ్రియాల్ వివరించారు.