గురుకులాల్లో అక్రమానికి లేదేది అనర్హం అన్నట్లు తయారయింది రాష్ట్రంలోని కొంతమంది గురుకులాల కాంట్రక్టర్ల తీరు…మొన్నటి వరకు ప్రొవిజన్స్ మొదలుకొని కూరగాయల సరఫరా వరకు నాసిరకం సరఫరా చేసి అందినకాడికి కొంతమంది కాంట్రాక్టర్లు దండుకోగా ఇప్పటికి కొంతమంది అదే విధానాన్ని కొనసాగిస్తుండగా తాజాగా గురుకులాలకు సరఫరా చేసే వంటనూనె లో సైతం బాగానే గోల్ మాల్ జరుగుతున్నట్లు తెలిసింది…వంటనూనె కిలో కు ఎక్కడ లేని ధరను ఫిక్స్ చేసుకొని ఓ కాంట్రాక్టర్ గురుకులాలకు వంట నూనె సరఫరా లో కోట్లు వెనకేసినట్లు ప్రచారం జరుగుతోంది… సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో ఈ కాంట్రాక్టర్ గత దశాబ్ద కాలానికి పైగా పాగా వేసి తనకు నచ్చిన ధరను పొందుతున్నట్లు గురుకులాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి… వరంగల్,ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏకైక వంట నూనె కాంట్రాక్టర్ గా ఉన్న ఇతగాడు ఆయిల్ సరఫరా లో గురుకులాలను శాసిస్తున్నట్లు తెలిసింది…
వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ధర…?
సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో వంట వంట నూనె సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ కు తెలంగాణలో ఎక్కడలేని విధంగా కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ధరలు సర్కార్ చెల్లిస్తున్నట్లు దృష్టికి వచ్చింది.. కిలో వంటనూనెకు 155 రూపాయలను సర్కార్ చెల్లిస్తోంది .. నిజానికి ఈ కాంట్రాక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలకు వంటనూనె సరఫరా చేయాలంటే కిలోకు 90 నుంచి 100 రూపాయల వరకు వెచ్చిస్తున్నట్లు తెలిసింది ..నిజానికి ఈ వంట నూనె బహిరంగ మార్కెట్లో సైతం ఇదే ధరకు లభిస్తోంది.. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్ కు 155 రూపాయలు ఎందుకు చెల్లిస్తున్నారో అర్థం కాని విషయం… కిలోకు 155 రూపాయలు పొందుతున్న ఈ కాంట్రాక్టర్ రోజుకు ఒక్కో గురుకులానికి 12 లీటర్ల వంట నూనెను సరఫరా చేస్తుండగా, మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న 22 సాంఘిక సంక్షేమ గురుకులాలకు రోజుకు 264 లీటర్ల వంట నూనెను సరఫరా చేస్తున్నాడు..అంటే నెలకు7,920 లీటర్లు… ప్రభుత్వం ఇచ్చే కమిషన్ పోను ఇతగాడు ఏ లెక్కన సర్కార్ సొమ్ము లబ్ధి పొందుతున్నాడో అర్థం చేసుకోవచ్చు…
అధికారుల సహకారం…?
బహిరంగ మార్కెట్ లో కిలో వంటనూనె వంద రూపాయల వరకు దొరుకుతున్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆ కాంట్రాక్టర్ కు 155 రూపాయలు సర్కార్ చెల్లిస్తుంది…నిజానికి ఉమ్మడి జిల్లాలోని అన్ని సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాలకు ఒకే ఒక వంటనూనె కాంట్రాక్టర్ ఉండగా ఎక్కువ మొత్తంలో వంట నూనె కొనుగోలు చేస్తే కిలో 90 రూపాయల కంటే తక్కువగానే వచ్చే అవకాశం ఉంది …ఇదంతా తెలిసిన గురుకుల అధికారులు ఈ కాంట్రక్టర్ కు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇలా అత్యధిక రేటు ఎందుకు చెల్లిస్తున్నారో వారికే తెలియాలి…ఇలా అత్యధిక ధర కాంట్రాక్టర్ కు చెల్లించడం వెనకాల గురుకుల అధికారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…కేవలం అధికారులు ఆ కాంట్రాక్టర్ కు సహకరిస్తున్నందువల్లే ఈ ధర సాధ్యం అవుతుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి…మరి ఇలా సహకరిస్తూ కాంట్రాక్టర్ కోట్లు కూడబెట్టేందుకు కారణం అవుతున్న అధికారులు ఏపాటి లబ్ది పొందుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి….వీటన్నింటికి అధికారులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది…మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి….