గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయంలో ఆర్ఐ హవా కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సదరు ఆర్ ఐ ఆ సర్కిల్ కార్యాలయాన్ని శాశిస్తున్నట్లు తెలుస్తుంది.గత కొద్ది రోజులుగా ఇంటి నెంబర్ల జారీ విషయంలో చేతివాటాన్ని ప్రదర్శించి అడ్డగోలుగా సొమ్ము చేసుకున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. తన దగ్గరికి వచ్చే నూతన నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కేటాయింపు విషయంలో సామాన్య ప్రజల నుండి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసిన విషయాన్ని న్యూస్ 10 దినపత్రిక “పైసలు ఇస్తేనే ఇంటి నెంబర్లు” అనే శీర్షిక ద్వారా వార్తను ప్రచురించగా మునిసిపాలిటీ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ నేపథ్యంలో సదరు అర్ ఐ బాధితులు న్యూస్ 10 దినపత్రికను ఆశ్రయించి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ముఖ్యంగా స్తంభంపల్లి,ఏనుమముల, క్రిస్టియన్ కాలనీలోని కొంతమంది ఆర్ఐ బాధితులు కొద్ది రోజుల క్రితం కాశిబుగ్గలోని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారులను నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్ఐకి డబ్బులు ఇచ్చాక కూడా ఇంటి నెంబర్ల జారీలో ఎందుకింత ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక్క స్తంభంపల్లి లోనే బిల్డర్ సహకారంతో 63 ఇంటి నెంబర్ల జారీకి ఐదు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న ఆర్ఐ ఇంకా 18 మందికి ఇంటి నెంబర్లు జారీ చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుచ్చుకున్న ముడుపుల్లో ఉన్నతాధికారులకు సైతం వాటాలు పంచాడన్న ఆరోపణలు కూడా లేకపోలేవు. పైగా ఆర్ఐ లీలలు అడ్డుకొని అక్రమాలను నిలువరించాల్సిన ఉన్నతాధికారులే ఇలా చేతివాటానికి అలవాటు పడి ఆ సొమ్ముతో రాజభోగాలు అనుభవించడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఆక్రమాలు పాల్పడుతున్న సదరు ఆర్ ఐ కి ఉన్నతాధికారుల ఆశీస్సులు మెండుగా ఉండడంతోనే ఆ ఉద్యోగి రెచ్చిపోతున్నట్లు సర్కిల్ ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా సర్కిల్ కార్యాలయానికి పెద్దదిక్కుగా ఉన్న అధికారి తన ప్రమేయం లేకుండా తనకు రావాల్సిన వాటా రాకుండా ఒక్క ఫైల్ కూడా అప్రూవల్ ఇవ్వద్దని కార్యాలయంలోని ఉద్యోగులందరికి ఆదేశాలు జారీ చేయడం కోసమెరుపుగా చెప్పవచ్చు…
40 అప్లికేషన్లు రిజెక్ట్ చేశాం…
డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి కాశిబుగ్గ మున్సిపల్ సర్కిల్ …
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఆర్ఐ పరిధిలోని 40 కి పైగా అప్లికేషన్లు తాజాగా రిజెక్ట్ చేశాం..ఆర్ వో నుండి ఇప్పటికే రిపోర్టు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు కాశిబుగ్గ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి న్యూస్ 10 ప్రతినిధికి తెలిపారు. సదరు ఆర్ఐ విధుల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసహనం కూడా వ్యక్తం చేశారు.ఇప్పటికే సదరు ఆర్ఐపై మున్సిపల్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు…