నేను బాగున్నా…నాకెలాంటి అనారోగ్య సమస్యలూ లేవు
అబద్ధపు ప్రచారాలు ఎవరూ చేయొద్దు, ఎవరూ నమ్మొద్దు
ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి
ప్రజల ఆశీస్సులతో నేను బాగున్నాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవు. దయచేసి ఎవరూ అబద్ధపు ప్రచారాలు చేయొద్దు. అలాంటి ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దు.
నాకు ఇబ్బందులు వస్తే… నా కుటుంబ సభ్యులు, ఆత్మబంధువులు, ప్రజలతోనే పంచుకుంటాను. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తనకు కరోనా వచ్చిందంటూ కొందరు వ్యక్తులు చేస్తున్న, కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులని మంత్రి ఎర్రబెల్లి ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, అబద్ధాలని కొట్టి పారేశారు.
అలాగే కరోనా వైరస్ విస్తారమవుతున్నదని, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది. మన దేశం, రాష్ట్రంలోనూ ఒకరిద్దరితో మొదలై వేలు లక్షలకు చేరుకుంటున్నదని మంత్రి తెలిపారు.
కరోనా సమాజిక వ్యాప్తి జరుగుతున్న తరుణంలో ఎవరూ దానికి అతీతులం కాదన్నారు.
అందుకే తాను ప్రజల కోసం, ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసానివ్వడానికి విశేషంగా, విస్తృతంగా ప్రజల్లోనే తిరుగుతున్నామన్నారు.
తనతోపాటు తన సిబ్బంది కూడా అహర్నిషలు పని చేస్తున్నారని చెప్పారు. నా కుటుంబంతో సహా, వాళ్ళందరి, వాళ్ళ కుటుంబాల క్షేమం కోసం హైదరాబాద్, పర్వతగిరిలలోని అన్ని రకాల సిబ్బందికి పరీక్షలు చేయించామన్నారు.
వారిలో తన రక్షణార్థం ఎస్కార్ట్, పైలట్ వాహనాలలో పని చేసే6గురు గన్ మెన్, మరో ఇద్దరు హైదరాబాద్ సిబ్బంది (వీరిలో ఒకరు వాచ్ మన్)కి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
వాళ్ళంతా తగు చికిత్సలు చేయించుకుంటున్నారని, క్షేమంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. నాతోపాటు, మిగతా సిబ్బంది అంతా క్షేమంగా, ఎలాంటి సమస్యలు కూడా లేకుండా హాయిగా, ఆరోగ్యంగా ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
నేను కొద్ది సేపటి క్రితం ప్రతి ఆదివారం, పది గంటలకు, పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం పనులు చేయడంతోపాటు, నేను నిర్వహిస్తున్న శాఖలు, నా నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఇలాంటి ఎలాంటి వదంతులని నమ్మవద్దని, అలాంటి దుష్ప్రచారాలు ఎవరూ చేయవద్దని నాకు నిజంగా అలాంటి సమస్యలే వస్తే. నేనే నేరుగా ప్రజలకు చెబుతానని, నా గురించి, నా ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.