బిసిల ప్లాట్లు గుంజుకునే ప్రయత్నాన్ని విరమించమనండి
ప్లాట్లు పంచేలా చొరవ చూపండి
రైతు వేదిక పేరుతో పేదల భూములు లాక్కుంటారా….?
మంత్రి ఈటల రాజేందర్ కు బిసిల వేడుకోలు
పైసా, పైసా పొగుచేసుకొని ప్రభుత్వ సహకారంతో భూమిని కొనుగోలు చేసుకొని, నిలువ నీడ కోసం ఎదురుచూస్తున్న తమ ప్లాట్లను రైతు వేదిక పేరిట స్వాధీనం చేసుకోవాలని సర్కార్ చూడడంపై కమలాపురం మండలం మర్రిపల్లి గూడెం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఇలా జరుగుతుంటే మంత్రి ఈటల రాజేందర్ స్పందించక పోవడంపై వారు నిరాశకు లోనవుతున్నారు.
తెలంగాణ రాకమునుపు అప్పటి ప్రభుత్వం కోటివరాల పథకం కింద తమకు అందించిన భూమి తమకు కాకుండా అవుతుందని ఈ విషయం పై ఈటల సారు దృష్టి సారించాలని వారు వేడుకుంటున్నారు. 185 మంది బిసి పేదలు ఇంటిస్థలం కోసం ప్లాట్లు సాదించుకోగా వాటిని రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు పంచకుండా అలాగే ఉంచి ఇప్పుడు రైతు వేదిక కోసం స్థలాన్ని లాక్కోవడం ఏ పాటి న్యాయమని వారు ఈటల ను అడుగుతున్నారు. బిసి లలో నిరుపేదలుగా ఉన్న తాము ఉన్న స్థలాన్ని సర్కారు లాగేసుకుంటే ఎక్కడికి వెళ్లాలని ఈటల ను వారు ప్రశ్నిస్తున్నారు.
రైతువేదికను తమ ప్లాట్లలో నిర్మించాలని ఏముందని ప్రభుత్వం తలుచుకుంటే వేరే దగ్గర స్థలం దొరుకుతుందని, అల చేయకుండా మా ఆధారం పై దెబ్బ కొట్టడం ఎందుకని వారు అంటున్నారు. రాష్ట్ర మంత్రి ఈటల తమ విషయంలో జోక్యం చేసుకొని ప్లాట్లు కోల్పోకుండా చేయాలని, ఇదే స్థలంలో తమకు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇయ్యాలని మర్రిపెళ్లి గూడెం ప్రజలు మంత్రి ఈటలను కోరుతున్నారు. ఇకనైనా తమ సమస్యపై దృష్టి సారించి తమ ప్లాట్లు తమకు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు వేదికను తమ జాగలో నిర్మించకూడదని పదే పదే వేడుకుంటున్నారు. మరి మంత్రి ఈటల సారు బిసిల విన్నపం పై ఎలా స్పందిస్తారో చూడాలి.