అరకొర వసతులు….అడ్డగోలు ఫీజులు

2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నగరంలో ప్రైవేటు పాఠశాలల దోపిడీ మొదలైంది. చెప్పే చదువుకు వసూలు చేసే ఫీజులకు అసలు పొంతనే లేకుండా పోతుంది. కార్పొరేట్ స్థాయిలో ఆకర్షణీయమైన పేర్లు,అందమైన భవనాల ఫోటోలతో నగరం మొత్తం ఫ్లెక్సీలు రంగురంగుల బ్రోచర్లతో ప్రచారం నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తున్నారు.అది నమ్మి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించిన వారిని అధిక ఫీజుల పేరుతో ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కాన్సెప్ట్,డిజి,మోడల్ ,పబ్లిక్ లాంటి ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులను తమ బుట్టలో వేసుకొని వారిని ఆర్థికంగా మరింత వెనకకు నెట్టేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం కాన్సెప్ట్ ,బిజీ,మోడల్, పబ్లిక్ లాంటి పేర్లు ఉండొద్దంటూ ప్రభుత్వం ఎన్ని జీవోలు తీసిన అవేమి తమకు పట్టనట్లు విద్యాశాఖ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారు.నగరంలో ఓ చిన్నపాటి సొంత భవనం ఉన్న అద్దె భవనం దొరికినా చాలు  ఓ పాఠశాలను స్థాపించి మాయ చేసే పేర్లతో తల్లిదండ్రులను బురిడీ కొట్టించి రెండు చేతుల సంపాదిస్తూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు.తమ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించి వారికి ఉన్నత భవిష్యత్తును అందించాలని కలలు కనే తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా చేసుకొని కొంతమంది విద్యా వ్యాపారులు నగరంలో కొత్త కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో చదువుతోపాటు పుస్తకాలు,బట్టలు,స్టేషనరీ వస్తువులు విక్రయిస్తూ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పుస్తకాలు స్టేషనరీ అమ్ముకోవాలని సూచించిన అవేమి పట్టనట్లు ఒక్కో తరగతి విద్యార్థి నుంచి ఎనిమిది నుండి పదివేల వరకు వసూలు చేస్తూ తమ వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. విద్యార్థులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకుండా వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకే కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు విద్యార్థుల సంఘాల నుండి వెల్లువెత్తుతున్నాయి….

విద్యార్థుల భవిష్య’త్తుకేది భరోసా…?

హనుమకొండ నగరంలోని ఇందిరానగర్ కాలనీలో కార్పొరేట్ విద్యా వ్యాపారం వెల్లివిరిస్తోంది. కాలనీలోని రెసిడెన్షియల్ భవనాలలో కార్పొరేట్ పాఠశాలలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. విద్యాశాఖ నుండి ఒకే అనుమతి పొందిన ఓ విద్యాసంస్థ మూడు చోట్ల పాఠశాలలను నిర్వహిస్తూ విద్యను వ్యాపారం చేస్తుంది. సిబిఎస్ ఈ ,స్టేట్ సిలబస్ ఐఐటి ,మెడికల్ ఫౌండేషన్ అంటూ అనుమతులు లేకున్నా నగరంలో ఫ్లెక్సీలు కరపత్రాలు పంచుతూ జోరుగా అడ్మిషన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులైన మరుగుదొడ్లు,క్రీడా మైదానాలు, ఫైర్ సేఫ్టీ లేకుండానే తరగతుల నిర్వాహనకు సిద్ధమైనట్లు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠశాలలో యథేచ్ఛగా పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్న విషయాన్ని విద్యార్థి సంఘాల నేతలు హన్మకొండ డీ ఈ ఓ దృష్టికి తీసుకెళ్లినా విద్యాశాఖ అధికారులు మాత్రం పాఠశాల యాజమాన్యంపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. సదరు పాఠశాల యాజమాని ప్రైవేట్ స్కూల్ యూనియన్లో కీలక నాయకుడు కావడంతో విద్యాశాఖ అధికారులు కూడా వారికే మద్దతుగా నిలుస్తున్నారన్న గుసగుసలు గట్టిగానే వినవస్తున్నాయి అంతేకాకుండా విద్యాశాఖ నుండి పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల్లో చేరే విద్యార్థులకు మునుముందు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వారి భవిష్య’త్తుకు ఎవరు భరోసా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వేచి చూడాలి మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలకు సిద్ధపడతారో లేక కార్పొరేట్ కళాశాలలకే కొమ్ము కాస్తారో….

నిబంధనలు పాటించని భవిష్య విద్య సంస్థలను మూసివేయాలి..

ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్

జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమంగా ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలను ముసివేయాలి. ఓకే బ్రాంచ్ కి అనుమతులు తీసుకొని విచ్చలవిడిగా బ్రాంచీలు ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల దోపిడీ చేస్తున్న భవిష్య విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.అలాగే జిల్లాలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల ముందు త్వరలో ఆందోళన కార్యక్రమాలు చెపడతాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here