ఇప్పుడైనా వరవరరావును విడుదల చేయాలి – విప్లవ రచయితల సంఘం

ఏదైతే భయపడుతున్నామో అదే జరిగింది. అనేక అనారోగ్య సమస్యలతో పాటు వరవరరావుకిప్పుడు కరోనా పాజిటివ్ కూడా తేలింది. లాక్ డౌన్ కాలం నుండి సుప్రీం కోర్టు ఆదేశాన్ని అనుసరించి రాజకీయఖైదీలను బెయిల్ పై గాని, పెరోల్ పై గాని విడుదల చేయాలని, వాళ్లను కరోనాకు బలిచేయవద్దని అడుగుతూనే ఉన్నాం. ముఖ్యంగా ఎనభై ఏళ్ల వరవరరావు ఆరోగ్యం గురించి పదేపదే ఆందోళన వ్యక్తం చేసినా, నెలన్నరగా ఆయన పరిస్థితి క్షీనిస్తున్నదని తెలుస్తున్నా ప్రభుత్వం, ఎం.ఐ.ఎ., న్యాయస్థానాలు కూడా నేరపూరిత నిర్లక్ష్యం వహించాయి.

ఇప్పుడైనా వరవరరావును విడుదల చేయాలి - విప్లవ రచయితల సంఘం- news10.app

ఒక్కసారి ఆయన్ని చూడనివ్వండని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేసినా అనుమతించలేదు. చివరికి నిన్న జెజె హాస్పిటల్ లో తీవ్ర ఆందోళనకర స్థితిలో ఆయన్ని కుటుంబసభ్యులు చూడవలసి వచ్చింది. ఒక పోలీసు తప్ప ఆయన బాగోగులు చూసుకునే వైద్యసిబ్బంది ఎవరూ అక్కడ లేరు. మనుషుల్ని కూడా వెంటనే గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయారాయన. ఈరోజు ఆయనకు కరోనా పాజిటివ్ కూడా తేలింది.

కరోనా ఆంక్షలను ఉపయోగించుకొని, లాయర్లతో సహా ఎవర్నీ ఆయనవద్దకు అనుమతించకుండా, ఆయన ఆరోగ్య స్థితి గురించి కోర్టుకు అపద్ధాలు చెబుతూ బెయిల్ రాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) అడ్డుకుంటున్నది. రాజకీయ ఖైదీలను చిత్రహింసలు పెట్టడానికే ప్రభుత్వం ఎం.ఐ.ఎ. అనే రాజ్యాంగ అతీత శక్తిని, ఊపా వంటి అప్రజాస్వామిక చట్టాన్ని ఉపయోగించుకుంటున్నది.

వరవరరావు తన భావాలను, రాజకీయ విశ్వాసాలు ఎన్నడూ దాచుకోలేదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడ్డం తప్ప ఆయన కుట్రలు చేసే వ్యక్తి కాదు. కవి ఎన్నటికీ కుట్రలు చేయడు. యాభై ఏళ్లుగా ఆయన మీద ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నీ ఎప్పటికప్పుడు తేలిపోయాయి. ఇప్పుడీ భీమాకోరేగాం కేసు కూడా అలాగే తేలిపోతుంది. కానీ విచారణే శిక్షగా మార్చి దేశంలోనే ప్రముఖ బుద్ధిజీవుల మీద కక్షసాధిస్తోంది ప్రభుత్వం.

వరవరరావును ఈ స్థితిలోకి నేట్టివేయడంలో తెలంగాణ ప్రభుత్వపాత్ర కూడా ఉంది. హైదరాబాద్ నుండే, ఆయన్ని మహారాష్ట్ర పోలీసులు తీసుకెళ్ళారు. తెలంగాణ కోసం, దేశ ప్రజల కోసం జీవితమంతా వెచ్చించిన కవి, మేధావిని కాపాడేందుకు జోక్యం చేసుకొమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఎంతమంది విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం చలనం లేకపోవడం దాని స్వభావాన్ని తెలియజేస్తోంది.

మనందరి కోసం మాట్లాడిన కవిని అచ్చంగా మనమే కాపాడుకోవాలి. వీలైన అన్ని పద్దతుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నామని విరసం పేర్కొంది.