కరోనా కట్టడిలో వంద శాతం సక్సెస్

గ్రీన్‌జోన్ వైపు పయనం

నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో వంద శాతం సక్సెస్ అయ్యామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ జాబితాలోకి చేరిందని, త్వరలోనే గ్రీన్‌జోన్‌లోకి వెళ్లబోతున్నామని, ఇది ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశమని ఆయన అన్నారు. ఆదివారం కరోనా నివారణ పై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నలభై రోజులుగా కరోనా నియంత్రణలో జిల్లా యంత్రాంగం, అత్యవసర సేవల విభాగం, త్యాగాలకోర్చి, ప్రాణాలకు తెగించి సేవలందించారని, అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.కరోనా కట్టడిలో వంద శాతం సక్సెస్- news10.appవిదేశాల నుంచి వచ్చిన 3,494 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచి కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టైమైన చర్యలు తీసుకునే విషయంలో యంత్రాంగం అతిపెద్ద సవాల్‌లుగా తీసుకొని పనిచేసిందన్నారు. మర్కజ్ యాత్రికుల నుంచి కరోనా వ్యాప్తి జరగడంతో ఆ దిశగా అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడం మూలంగా దీన్ని పూర్తిగా నియంత్రణలోకి తీసుకోగలిగామన్నారు. 61 మంది పాజిటివ్ కేసులలో 32 మందికి నేరుగా కరోనా సోకగా వారి నుంచి 22 మంది ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా, ఐదుగురికి సెకండరీ కాంటాక్ట్ ద్వారా, ఒకరికి విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి కరోనా సోకిందని, ఇందులో ఇప్పటికే 47 మంది డిశ్ఛార్జి అయ్యారన్నారు. 14 మంది మాత్రమే గాంధీ దవాఖానలో ప్రస్తుతం చికిత్సలు పొందుతున్నారని, త్వరలోనే వీరు కూడా ఆరోగ్యంతో తిరిగి వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఫలితాలే జిల్లా యంత్రాంగం పనితీరుకు నిదర్శనమని, వంద శాతం మనం సక్సెస్ అయ్యామనడానికి తార్కానమని పేర్కొన్నారు. అయితే ఈ ముందు జాగ్రత్త చర్యలు ఇకముందు కొనసాగాలని, నిర్లక్ష్యం తగదని మంత్రి సూచించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా తమవంతు బాధ్యతగా సహాయ, సహకారాలు అందిస్తునే ప్రజలకు మనోధైర్యాన్ని నింపారని అభినందించారు. ఓ వైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు జిల్లా యంత్రాంగం సమిష్ఠిగా కృషి చేసి కరోనాను జిల్లా నుంచి తరిమి కొట్టే క్రమంలో అద్భుతమైన పనితీరును, బాధ్యతను కనబరిచారని ప్రశంసించారు.

జిల్లాలో ఇప్పటి వరకు 1,035 శాంపిళ్లను సేకరించామని, ర్యాండమ్‌గా శాంపిళ్లు కూడా సేకరించి పరీక్షలు జరిపామని, కమ్యూనిటీ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ నెల 5న కేబినెట్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి మనమంతా ముందుకు సాగాలని, ఇదే స్ఫూర్తితో జిల్లాను గ్రీన్‌జోన్‌లోకి తీసుకువచ్చేందుకు పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా కరోనా కట్టడిలో మంత్రి చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధ పై ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. మంత్రి నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశం ఎంతో పనిచేసిందని, మరోవైపు జిల్లా యంత్రాంగం, అత్యవసర సేవల సిబ్బంది, ఉద్యోగులు తీసుకున్న చర్యలు ఉపయోగపడ్డాయని గుర్తు చేసుకున్నారు.

– మంత్రి చొరవ అభినందనీయం…

మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాలో కరోనా నియంత్రణ విషయంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశేషంగా కృషి చేశారని జిల్లా ఎమ్మెల్యేలు కొనియాడారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ మాట్లాడుతూ.. ఈ కష్టకాలంలో మంత్రి పనితీరు అద్భుతంగా ఉందన్నారు.

జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి కరోనాను కంట్రోల్ చేయడంలో ఆయన ప్రతిభ ఉపయోగపడిందని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ సహా, సీపీ, అత్యవసర విభాగాల సిబ్బంది అద్భుత పనితీరును కనబరిచి కరోనాను నియంత్రించగలిగారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఈ కష్ట సమయంలో ఓ సైనికుల్లాగా ప్రతి ఒక్కరు పోరాటం చేసి విజయం వైపు పయనిస్తున్నారని అభినందించారు.

ప్రజల్లో ఈ సందర్భంగా ఎంతో మార్పు కనిపిస్తుందని, ఇదే పద్ధతి ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాలో మంత్రి కరోనా కట్టడికి తనవంతుగా కృషి చేశారని, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు గాని, ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేమని కేసీఆర్ చెప్పిన విధానం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసిందని, ఆమేరకు నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం ఉపకరించిందని అన్నారు.

అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ పోరాటం చివరి వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాద తీవ్రతను వెంటనే గుర్తించి, మంత్రి సకాలంలో స్పందించారని ఆమేరకు తీసుకున్న జాగ్రత్తలు, చర్యలు కరోనా నియంత్రణలో ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతే త్వరలో గ్రీన్‌జోన్‌లోకి వెళ్లడం పెద్ద సమస్యకాబోదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here