విద్యుత్ శాఖ నిబంధనలు తుంగలోతొక్కి తమ ఇష్టానుసారంగా అనుమతి లేని వెంచర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా?లేదా అనే చర్చ ఇప్పుడు విద్యుత్ శాఖలో జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ గొర్రెకుంట శివారు హరిహర ఎస్టేట్(అపర్ణ బిల్డర్స్) ఎదురుగా ఉన్న అనుమతి లేని వెంచర్ లో స్థానిక విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఆ అక్రమ వెంచర్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన విషయాన్ని న్యూస్-10 వరుస కథనాలను ప్రచురిస్తోంది. సదరు అనుమతి లేని వెంచర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం పై న్యూస్-10 వస్తున్న కథనాలు ఇప్పుడు విద్యుత్ శాఖలో తీవ్ర దుమారాన్నే రేపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.అంతేకాకుండా ఆ అనుమతి లేని వెంచర్ లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన స్థానిక విద్యుత్ అధికారులు వారికి సహకరించిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఏంచేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది.