వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం రోజురోజుకు పెరిగిపోతుంది.ఈ ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా గెలుపు తీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్న కార్యకర్తల్లో తీవ్ర అసహనం నెలకొంది.పార్టీ అభ్యర్థి కె ఆర్ నాగరాజు అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుండి నియోజకవర్గ స్థాయి నాయకులను ఏమాత్రం కలుపుకు పోవడం లేదని వారిలో ఆవేదన మొదలైందట.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ అభ్యర్థికి నియోజకవర్గంలో పరిచయాలు తక్కువగా ఉన్నప్పటికీ పార్టీ కోసం కష్ట పడ్డ వారికి సరైన గుర్తింపు దక్కటం లేదని దీనికి తోడు కార్యకర్తలతో సమన్వయలోపం కూడా ఒక కారణమని తెలుస్తుంది.విస్తీర్ణంలో పెద్ద నియోజకవర్గం కావడంతో అభ్యర్థికి ఊరూరా ప్రచారం చేయడం కూడా సవాల్ గా మారిందట.ఎమ్మెల్యే ఆరురి రమేష్ పై ఉన్న వ్యతిరేకతను అదునుగా భావించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టితే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవ్వరు ఆపలేరని కానీ ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఫలం అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ధీంతో అధికార పార్టీ గెలుపుకు మరోసారి అవకాశం ఇచినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..నిజామాబాద్ పోలీసు బాస్ గా విధులు నిర్వహించి అనంతరం రాజకీయ అరంగేట్రం చేసిన నాగరాజు ఇప్పటికి పోలీసు అధికారిగానే వ్యవహరిస్తున్నాడని నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే అయినప్పటికీ వాటికి అదే స్థాయిలో అదే రీతిలో బదులు ఇవ్వలేకపోతున్నాడని పార్టీ కార్యకర్తల నుండి వస్తున్న టాక్.ధీంతో చేసేదేమీ లేక నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు కూడా పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ కండువా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంతృప్తు లను చేరదీసి వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.