నగరంలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అధికారులు వాటిని నిలువరించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అనుమతులు లేకుండా వెలుస్తున్న చిన్నచిన్న భవనాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తూ వాటిని నేలకూలుస్తున్నారు.కానీ అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలపై చర్యలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అన్న అనుమానం రాకమానదు.సరిగ్గా ఇదే కోవాకు చెందింది కేయూ క్రాస్ నుండి కాజీపేటకు వెళ్లే 100 ఫీట్ల రోడ్డు ప్రక్కన ఇటీవల ప్రారంభమైన మెడ్ హెల్త్ ఆసుపత్రి భవనం. మున్సిపల్ శాఖ నుండి అనుమతులు పొందిన సదరు యజమాని భవన నిర్మాణాన్ని మాత్రం టౌన్ ప్లానింగ్ అనుమతులకు పూర్తి విరుద్ధంగా నిర్మించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్టిల్ట్ తో పాటు నాలుగు అంతస్తులకు మున్సిపల్ పన్ను చెల్లించి అనుమతులు తీసుకున్న నిర్మాణదారుడు అదనపు అంతస్తుతో పాటు ఎలాంటి సెట్ బ్యాక్ డీవియేషన్ లేకుండా అక్రమ నిర్మాణాన్ని చకచకా పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే సదరు యజమాని రెసిడెన్షియల్ తో పర్మిషన్ పొందిన భవనాన్ని కమర్షియల్ గా ఆస్పత్రిని నిర్వహిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నాడన్న ఆరోపణలు లేకపోలేవు. పార్కింగ్ ఫైర్ సేఫ్టీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి దర్జాగా మెడ్ హెల్త్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం చర్యలకు ముందడుగు వేయడం లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఆసుపత్రి యాజమాన్యానికి రాజకీయంగా ఉన్నతమైన పలుకుబడి ఉన్నందునే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని తెలిసిన చర్యలకు వెనుకడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వేచి చూడాలి మరి మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణం విషయంలో ఏ విధంగా స్పందిస్తారో మరి..