మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడితో పాటు సానుభూతిపరుడి అరెస్టు
నిషేధిత మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడితో పాటు కేంద్ర కమిటీ సభ్యుడితో పాటు సానుభూతిపరుడిని సుబేదారి పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. వీరినుండి 21వేల రూపాయల నగదు, విప్లవ సాహిత్యం, ఒక పెన్ డ్రైవ్, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మూల దేవేందర్ రెడ్డి అలియాస్ మాధవ్ అలియాస్ కరప అలియాస్ నందు, బబ్బేరు చెలుక, మంచిర్యాల జిల్లాకు చెందినవాడు కాగా ఇతను ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారుణ్య స్పెషల్ జోనల్ సభ్యుడి హోదాలో సెంట్రల్ టెక్నికల్ విభాగంలో టీం సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మరో వ్యక్తి గుర్రం తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి, వికాస్ నగర్, హనుమకొండ జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుల సానుభూతి పరుడిగా పనిచేస్తున్నాడు.
మూల దేవేందర్ రెడ్డి ప్రస్థానం
తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్న దేవేందర్ రెడ్డి 1978 సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ రాడికల్ విభాగం సిటీ ఆర్గనైజర్ పోరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగాలు విని పీపుల్స్ వార్ సిద్దాంతాలకు ఆకర్షితుడై కొద్ది కాలంపాటు పీపుల్స్ వార్ పార్టీ సానుభూతిపరుడిగా పనిచేసి సి.ఓ వెంకటరెడ్డి ప్రోత్సహంతో 1982 సంవత్సరంలో సిరిపూర్ దళ సభ్యుడిగా చేరాడు. అసమయంలో ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న సిరిపూర్ దళ కమాండర్ గా వ్యవహరించారు. మూడు సంవత్సరాల పాటు సిరిపూర్ దళం లో పనిచేసిన దేవేందర్ రెడ్డి పలు విధ్వంస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అనంతరం 1985 సంవత్సరంలో అప్పటి డి.సి.యం కటకం సుదర్శన్ ఆలియాస్ అనంద్ ఉత్తర్వుల మేరకు దేవేందర్ ను ఆహేరి దళంకు బదిలీ చేసారు. 1987 సంవత్సరంలో దళ సభ్యురాలు ఆత్రం బయ్యక్క అలియాస్ జ్యోతిని వివాహం చేసుకున్నాడు. 1988 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు అహేరి దళం డిప్యూటీ కమాండర్ గా, 1989 సంవత్సరంలో మహారాష్ట్ర ఏరియా దళానికి డిప్యూటీ కమాండర్ గా పనిచేసాడు. 1994 సంవత్సరంలో పీపుల్స్ వార్ , పోలీసులకు మద్య జరిగిన ఎదురుకాల్పుల్లో దేవేందర్ రెడ్డి భార్య జ్యోతి మరణించింది. 1995 సంవత్సరంలో మాడ్ ఏరియా కిస్కోడా దళ కమాండర్ గా పనిచేసే సమయంలో దేవేందర్ రెడ్డికి సెంట్రల్ టెక్నికల్ కమిటీ సభ్యుడైన రమణతో పరిచయం అయింది. ఈ పరిచయంతో పార్టీ నాయకత్వం 1996 సంవత్సరంలో దేవేందర్ రెడ్డిని డి.సి.యం సభ్యుడి హోదాలో దండకారుణ్య ప్రాంతంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్ 2003 సంవత్సరం వరకు పనిచేసాడు. టెక్నికల్ డిపార్ట్మెంట్ కమాండర్ గా పనిచేసిన సమయంలో దేవేందర్ రెడ్డి సూమారు 850 పైగా తుపాకులను తయారు చేసి పీపుల్స్ వార్ పార్టీ అందజేసాడు. ఇదే సంవత్సరంలో మహిళ దళ సభ్యురాలైన దేవియా హుస్సేండి అలియాస్ రూపిని దేవేందర్ రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. 2007 సంవత్సరంలో దేవేందర్ రెడ్డి, తన భార్య, మరికొద్దిమంది దంకారుణ్య కమిటీ సభ్యులతో కల్సి తయారు చేసిన తుపాకులను చర్ల మీదుగా దండకారుణ్యంకు వెళ్ళుతుండగా పోలీసులకు పట్టుబడి 2009 వరంగల్ సెంట్రల్ జైలు శిక్షను అనుభవించాడు.
జైలు నుండి విడుదల అనంతరం దేవేందర్ రెడ్డి తన భార్య రూపితో కల్సి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 2010 సంవత్సరంలో సెంట్రల్ కమిటీ అదేశాల మేరకు పీపుల్స్ వార్ దళాలకు కావాల్సిన 12బోర్, పాయింట్ 303 తుపాకులను తయారుచేసి పార్టీకి అందజేసాడు. 2011 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు దేవేందర్ రెడ్డి దంపతులను సౌత్ మరియు వెస్ట్ బస్టర్ ప్రాంతాలకు బాధ్యులుగా చేస్తూ బదిలీ అయి 2017 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు పనిచేసారు. ఇదే సమయంలో దేవేందర్ రెడ్డి వివిధ రకాల తుపాకులు, మందుపాతరలు, రాకెట్ లాంచర్లు తయారు చేసి దళాలకు అందించడంలో కీలకంగా నిలవడంతో ఇతనిని పార్టీ అధిష్టానం దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇప్పటి వరకు దేవేందర్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర విభాగానికి చెందిన సభ్యులతో పాటు, దండకారుణ్య, నార్త్ జోన్ కు చెందిన కీలక మావోయిస్టు నాయకులతో పనిచేసాడు. గత కొద్దికాలంగా దేవేందర్ రెడ్డికి కంటిచూపు సమస్య రావడంతో తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేశాల మేరకు కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళుతున్న క్రమంలో దేవేందర్ రెడ్డి సానుభూతిపరుడు తిరుపతి రెడ్డితో కలిసి సుబేదారి బస్ స్టాప్ వద్ద పోలీసులకు చిక్కారు.
మూల దేవేందర రెడ్డి అలియాన్ మాధవ్ పాల్పడిన నేరాలు
పోలీసులకు చిక్కిన దేవేందర్ రెడ్డి పార్టీ అధినాయక్వతంతో పాటు ప్రస్తుత కేంద్ర మరియు రాష్ట్ర నాయకులతో కల్సి 33కి పైగా నేరాలకు పాల్పడ్డాడు. ఇందులో ప్రధానంగా 2010 సంవత్సరంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, హిద్మా మరియు మరో మూడు వందల మంది మావోయిస్టులతో కల్సి ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడిమెట్ల అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న సి.ఆర్.పి.ఎఫ్ పోలీసు బృందాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 75 మంది సిఆర్పిఎఫ్ పోలీసులను హత్య చేసి వారి నుండి తుపాకులను ఎత్తుకెళ్ళిన సంఘటనలో కీలక నిందితుడు. అలాగే నారాయణపూర్ జిల్లా దౌడాయి పోలీస్ స్టేషన్ పరిధిలో 27 మంది పోలీసులు, 2011 సంవత్సరంలో దంతేవాడ జిల్లా బూరుగూడ ఆటవీ ప్రాంతంలో ఏడుగురు సిఆర్పిఎఫ్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చిన హత్య సంఘటన, 2012లో బాసనగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పోలీసులు, 2013 సంవత్సరంలో దమ్ముగూడెం వద్ద హోంగార్డ్. ఇదే సంవత్సరంలో ఆవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు పోలీసులు, 2014లో సుకుమా జిల్లా తొంగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సిఆర్పిఎఫ్, నలుగురు సివిల్ పోలీసులు, 2016లో దంతేవాడ జిల్లా, కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు సిఆర్పిఎఫ్ పోలీసులు, 2017లో బెజ్జి పోలిస్ స్టేషన్ పరిధిలోని 11మంది సిఆర్ఎఫ్, ఇదే సంవత్సరంలో చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది పోలీసులు, 2018 సంవత్సరంలో కిష్టారం ప్రాంతంలో 9 మంది పోలీసులు, 2020 సంవత్సరంలో ఇర్చపల్లి అటవీ ప్రాంతంలో ముగ్గురు, చింతగుప్పా అటవీ ప్రాంతంలో 17మంది పోలీసులు, 2021లో టేకుల గుర్మా ఆటవీ ప్రాంతంలో 22 మంది పోలీసులపై కాల్పులు జరిపి హత్య చేసి చనిపోయిన పోలీసులకు చెందిన తుపాకులను ఎత్తుకెళ్ళి సంఘటల్లో దేవేందర్ రెడ్డి కీలకంగా నిలవడంతో పాటు ఛతీస్తగడ్ మరియు ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో ఇన్స్ఫార్మర్ నేపంతో సాధారణ పౌరులను హత్య చేయడంతో పాటు, వివిధ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంలో దేవేందర్ రెడ్డి నేరస్థుడు, దేవేందర్ రెడ్డిపై 20లక్షల రూపాయల రివార్డును వుందని పోలీసులు తెలిపారు..
సానుభూతిపరుడు తిరుపతి రెడ్డి ప్రస్థానం
పోలీసులు అరెస్టుచేసిన సానుభూతిపరుడు తిరుపతి రెడ్డి 1989లో ఉద్యోగరీత్యా దుబాయికి వెళ్ళి వచ్చి తన గ్రామంలో కెనాల్ కాంట్రాక్ట్ పనులు చేయించే తిరుపతిరెడ్డికి దడబోయిన స్వామి ఆలియాస్ ప్రభాకర్ తో పరిచయం కావడంతో జనగాం ఏరియా పీపుల్స్ వార్ దళాలకు నిత్యావసర వస్తువులను అందజేసేవాడు. ఇదే సమయంలో తిరుపతి రెడ్డికి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ తో పరిచయం అయింది. ఈ పరిచయం. తిరుపతి రెడ్డి మావోయిస్టు నాయకులకు కావల్సిన వస్తువులను అందజేయడంతో పాటు, దళసభ్యులకు రహస్యంగా చికిత్స అందించేవాడు. ఇదే రీతిలో కంటి చికిత్స కోసం దేవేందర్ రెడ్డి తిరుపతిని మావోయిస్టు పార్టీ నాయకులకు సూచించడంతో నిన్న సాయంత్రం తిరుపతి రెడ్డి, మావోయిస్టుతో దేవేందర్ రెడ్డి కలిసి హైదరాబాద్ కు వెళ్ళే క్రమంలో సుబేదారి పోలీసులకు చిక్కినట్లు సీపీ రంగనాధ్ మీడియా సమావేశంలో వెల్లడించారు…