ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న పినపాక మండలం లోని పలు గ్రామాల వ్యవసాయ క్షేత్రాలలో బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు పర్యటించారు. చింతల బయ్యారం, రావి గూడెం, బయ్యారం పంచాయతీలోని నాటుకు సిద్ధంగా ఉండి గోదావరిలో మునిగి కొట్టుకుపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. సోమవారం బయ్యారం గ్రామానికి చెందిన రైతు బ్రహ్మారెడ్డి సాగుచేస్తున్న నీట మునిగిన వరి నారుమడి తో పాటు పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.అనంతరం ఏఈవో లక్ష్మణరావు మాట్లాడుతూ.. వరద ముంపు ప్రాంతాల్లోని నీటమునిగిన వివిధ రకాల పంటలను పరిశీలిస్తున్నామని, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ప్రస్తుతం పంటలు ఇంకా నారు దశలో ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని లక్ష్మణ్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.