పౌరసరఫరాల శాఖ అధికారుల చేతివాటమే పిల్లల ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందా?ఇన్వెస్టర్ గోదాముల్లో ఉన్న బియ్యం నాణ్యమైనవి కాదా? ఎటువంటి టెస్ట్ లు నిర్వహించకుండానే ఆ బియ్యాన్ని పాస్ చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, కేసముధ్రం ఇన్వెస్టర్ గోదాముల్లో నాణ్యత లేని బియ్యం భారీగా నిల్వ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సివిల్ సప్లై “టీఏ” నాణ్యత పరిశీలించకుండానే కొంతమంది మిల్లర్ లు తెచ్చిన సిఎంఆర్ ను పాస్ చేయడం మూలంగానే నాణ్యత లేని బియ్యం ఆ రెండు గోదాముల్లో భారీగా ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని బియ్యాన్ని పాస్ చేసేందుకు సదరు టీఏ ఒక్కో ఏసికే కు 50 వేల నుండి 1 లక్ష రూపాయలు ముడుపుల రూపంలో తీసుకున్నారని ఆరోపణలు రావడం కొసమెరుపు. అయితే ఆ గోదాముల్లో ఉన్న నాణ్యత లేని బియ్యం సంక్షేమ హాస్టళ్లకు సైతం సరఫరా ఐయ్యే అవకాశం ఉందని దీనివల్ల పిల్లలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కావున జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆ రెండు ఇన్వెస్టర్ గోదాముల్లో ఉన్న బియ్యానికి పౌరసరఫరాల శాఖ అధికారులు “ఆర్ ఓ”ఇవ్వకుండా నిలిపివేసి తక్షణమే తనిఖీ చేపడితే నాణ్యత లేని బియ్యం భారీస్థాయిలో బయటపడే అవకాశం ఉందని తెలిసింది.
నాణ్యమైన బియ్యం బయట… నాణ్యత లేని బియ్యం లోపల..?
మహబూబాబాద్ జిల్లాలోని ఇన్వెస్టర్ గోదాముల్లో అంటే మహబూబాబాద్, కేసముధ్రం గోదాముల్లో రీసైక్లింగ్ బియ్యం(నాణ్యత లేని బియ్యం) నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొంతమంది మిల్లర్ లు పౌరసరఫరాల శాఖ పంపిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకొని తిరిగి ప్రభుత్వానికి సిఎంఆర్ పెట్టే సమయంలో నాణ్యత లేని బియ్యo తోపాటు పిడీఎస్ బియ్యాన్ని (రీసైక్లింగ్) పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గోదాముకు వచ్చిన రీసైక్లింగ్(నాణ్యత లేని బియ్యం)బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు చాకచక్యంగా లోపల వేసి నాణ్యమైన బియ్యాన్ని బయట వేసినట్లు సమాచారం. అంటే ఆ గోదాముల్లో ఒక్క బెడ్ లో 6 ఏసికే ల బియ్యం బస్తాలు ఉంటే 3 ఏసికెల బియ్యం నాణ్యమైనవి కావని విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రతి బెడ్ లో బయటకు కనిపించేవిధంగా నాణ్యమైన బియ్యం బస్తాలను ఉంచి లోపల నాణ్యత లేని బియ్యం బస్తాలను పెడుతున్నారని న్యూస్-10 నిఘా టీం పరిశీలనలో తేలింది.
కలెక్టర్ పట్టించుకుంటారా…?
మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, కేసముధ్రం ఇన్వెస్టర్ గోదాముల్లో ఉన్న నాణ్యత లేని బియ్యానికి “ఆర్ ఓ” ఇచ్చేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమైన నేపథ్యంలో న్యూస్-10 సంచలన విషయాన్ని సోమవారం ప్రచురించింది. ఆ రెండు ఇన్వెస్టర్ గోదాముల్లోని నాణ్యత లేని బియ్యం కనుక బయటికి వెళితే సంక్షేమ హాస్టల్స్ పిల్లల ప్రాణాలతోపాటు ,సామాన్యుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కనుక మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ తక్షణమే పౌరసరఫరాల శాఖ అధికారులు ఇచ్చే “ఆర్ ఓ” లను నిలిపివేసి క్షేత్రస్థాయిలో రెండు గోదాముల్లోని బియ్యాన్ని పరిశీలించి సదరు మిల్లర్ లతోపాటు వారికి సహకరించిన ఉద్యోగులపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలతోపాటు పిల్లల ప్రాణాలు కాపాడాలని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు