నగరంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అవి దేవుని భూములైన ప్రభుత్వ భూమి అయినా చెరువు శిఖాలను సైతం వదిలిపెట్టకుండా ఆక్రమిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పద్మాక్షి దేవాలయానికి చెందిన 898 సర్వే నెంబర్ భూమిలో ఉన్న పద్మాక్షి గుట్టను తొలుస్తూ అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా జోరుగా పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వెలుస్తున్న ఈ నిర్మాణాలకు మునిసిపల్ రెవిన్యూ శాఖల నుండి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవుని మాన్యాలను ప్రభుత్వ భూములను కాపాడవలసిన ఎండోమెంట్, రెవెన్యూ అధికారులు మాకేం పట్టవన్నట్లు వ్యవహరిస్తూ కోట్ల విలువైన దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్న చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు స్థానికుల నుండి వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై న్యూస్ 10 ప్రతినిధి రెవెన్యూ అధికారులను వివరణ కోరగా మున్సిపల్,దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయం కుదుర్చుకొని చర్యలు తీసుకుంటామంటూ సమాధానం ఇస్తున్నారు.నగరంలోని భవనాలకు అనుమతులు ఇచ్చి నిర్మాణం లో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించకుండా నిత్యం పర్యవేక్షించవలసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారు.అక్రమ నిర్మాణాల విషయం వార్తల రూపంలో వస్తే కానీ చర్యలకు సిద్ధపడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.అక్రమార్కులకు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా వుండటం వల్ల సంబంధిత శాఖల అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి అధికారులు ఇలాగే అలసత్వం ప్రదర్శిస్తే ఆలయ భూములు, ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లో చిక్కి కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వేచి చూడాలి మరి అధికారులు ప్రభుత్వ భూముల రక్షణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో మరి…