త్రినగరిలో సెల్ ఫోన్ రిపైర్లు ,విడి భాగాల అమ్మకాలకు కేరాఫ్ గా మారిన వరంగల్ లోని డాల్ఫిన్ గల్లీలో సెల్ ఫోన్ల,విడి భాగాల జీరో దందా జోరుగా కొనసాగుతుంది.నిత్యం జనంతో కిక్కిరిసిపోయే డాల్ఫిన్ గల్లీలో రోడ్డుకు ఇరువైపులా వందల కొద్దీ మొబైల్ రిపేర్ సెంటర్లతో పాటు విడిభాగాలు విక్రయించే ఎలక్ట్రానిక్ దుకాణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు విడిభాగాలు విక్రయిస్తూ పాత సెల్ ఫోన్లు రిపేర్ చేస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు ఇక్కడి వ్యాపారులు. ఇంతవరకు బాగానే ఉన్నా వారు విక్రయిస్తున్న మొబైల్ స్క్రీన్ కార్డ్స్ ,చార్జర్స్ ,కేబుల్స్ అన్ని దుకాణాల్లో నాసిరకం వస్తువులే అన్న ఆరోపణలు లేకపోలేదు.అచ్చం బ్రాండెడ్ వస్తువులను పోలి ఉండే ఈ నాసిరకం వస్తువులను వినియోగదారులకు అంటగడుతూ కస్టమర్లను నిలువునా దోచేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. చైనా వస్తువులనే బ్రాండెడ్ కంపెనీ కవర్లలో ప్యాకింగ్ చేసి మరి కస్టమర్లకు అంటగడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబై ,హైదరాబాద్ ,బెంగళూరు లాంటి మహానగరాల నుండి భారీ మొత్తంలో నాణ్యతలేని మొబైల్ ఫోన్ విడిభాగాలను దిగుమతి చేసుకొని తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగా దిగుమతి చేసుకున్న చైనా వస్తువులపై జిఎస్టి ఇతర పన్నులంటూ అధిక ధరలు వసూలు చేస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నారట పైగా కస్టమర్లు కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లులు గ్యారెంటీ కూడా ఇవ్వకుండా వారిని మోసం చేస్తున్నారు. డాల్ఫిన్ గల్లీలో ఉన్న వందల కొద్ది మొబైల్ అమ్మకాల దుకాణాల్లో చాలావరకు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రతి సంవత్సరం మున్సిపల్ నుండి ట్రేడ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాల్సిన షాప్ యజమానులు మున్సిపల్ అధికారుల చేతులు తడిపి నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని అడ్డుఅదుపు లేకుండా యదేచ్చగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా నాసిరకం వస్తువులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేరని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించాలి..
నగరంలో నాసిరకం సెల్ఫోన్లతో పాటు ఇతర విడిభాగాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా వరంగల్ డాల్ఫిల్ గల్లీలోని మొబైల్ వ్యాపారులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఈ వ్యాపార సముదాయాలపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేయక కొన్ని సంవత్సరాలు దాటిందని దాంతో వారికి భయం లేకుండా పోయిందని ఇప్పటికైనా నాణ్యతలేని వస్తువులు, ట్రేడ్ లైసెన్స్ అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులపై అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. వేచి చూడాలి మరి ఇప్పటికైనా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో..