ప్రజా సమస్యలపై దృష్టి సారించి వారిచ్చే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాల్సిన ఓ పోలీస్ అధికారి తన విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు ఇచ్చే ఫిర్యాదుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆ ఎస్ఐకి ఎందుకో అంత నిర్లక్ష్యం అన్న ప్రశ్నలు సామాన్య జనాల నుండి ఉత్పన్నమవుతున్నాయి. నిత్యం శాంతి భద్రతలు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆ పోలీస్ అధికారి అనేక విమర్శల పాలవుతూ తన స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజల నుండి అసహనం వ్యక్తం అయ్యేలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాజీపేట సబ్ డివిజన్ పరిధి లోని ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఎస్సై రూటే సప’రేటు’అన్న చర్చ జోరుగా సాగుతోంది. కరీంనగర్, హన్మకొండ జాతీయ రహదారి వెంట ఉన్న ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో భూతగాధాలే టార్గెట్ గా చేసుకొని ఆ పోలీస్ అధికారి అడ్డగోలుగా ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. తన వద్దకు వచ్చే భూ పంచాయతీల,ఆస్తుల ధ్వంసం సంఘటనల విషయంలో బాధితులకు ఎలాంటి న్యాయం చేయకపోగా వారిచ్చే ఫిర్యాదులపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండానే పెద్దమనుషులతో సెటిల్ చేసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తూ బాధితుల నుండి పెద్ద మొత్తంలో ముడుపులు అందుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి..కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి అన్న కుమారుడితో ఉన్న చనువు కారణంగానే విధుల పట్ల అలసత్వం,నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడన్న ఆరోపణలు లేకపోలేవు.. తాజాగా జరిగిన మంత్రి అన్న కొడుకు పుట్టిన రోజు వేడుకల్లో సదరు ఎస్సై నే అంతా తానై వ్యవహరించడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.అదే మండలానికి చెందిన ఓ గ్రామంలోని భూ భాధితుడు తన సమస్య పట్ల ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ న్యాయం చేయకపోగా తననే స్టేషన్ చుట్టూ తిప్పుకుంటు ముప్పు తిప్పలు పెడుతున్నాడని ఎస్సై ఆగడాలు భరించలేక తాజాగా డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.శాంతి భద్రతలు,ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేరు ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ ఇలాంటి పోలీసు అధికారుల వల్ల పోలీసుల పనితీరు ,ప్రతిష్ట అభాసు పాలవుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కాజీపేట సబ్ డివిజన్ కు చెందిన ఆ పోలీసు స్టేషన్ ఎస్సై ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు..