గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లోని టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై జోరుగా విమర్శలు వినవస్తున్నాయి. పేదలకు ఒకలా బడాబాబులకు మరోలా వారి నిబంధనలు ఉంటున్నట్లు తెలుస్తోంది. సామాన్యులు నిబంధనలకు కాస్త అటూ ఇటుగా గృహనిర్మాణం చేసుకుంటే ఆఘమేఘాల మీద చర్యలు తీసుకునే టౌన్ ప్లానింగ్ అధికారులు బడాబాబులు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినప్పటికీ వారితో మిలాఖత్ అయ్యి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. హన్మకొండ చౌరస్తాలోని రిధమ్ హాస్పిటల్ బిల్డింగ్ పై టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనం వహిస్తున్నారు. ఆ ఆసుపత్రి భవనం అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన విషయం న్యూస్-10 వరుస కథనాలను ప్రచురించింది. నిబంధనలకు విరుద్ధంగా రిధమ్ ఆసుపత్రి నిర్మాణం ఉన్న విషయం టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినప్పటికీ వారు తమకేంపట్టనట్లు వ్యవహరించడం వెనుక అమ్యామ్యాల రహస్యం దాగిఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రిధమ్ హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయి ఆసుపత్రి ప్రారంభించినప్పటికి ఇప్పటికి అసలు ఆ బిల్డింగ్ కు ఓసి ఇచ్చారో లేదో తెలియని పరిస్థితి, ఒకవేళ ఓసి ఇయ్యకుంటే ఆ బిల్డింగ్ లో ఆసుపత్రి ఎలా నడుస్తుందో టౌన్ ప్లానింగ్ అధికారులకే తెలియాలి.