కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు,ఆల్ ఇండియా ర్యాంకులు మా విద్యార్థులకే సొంతం అంటూ ప్రచారం తో హోరెత్తించి మా కలశాలలో చేర్పించండి మంచి భవిష్యత్తు ఇస్తాం అని నమ్మబలికి,లక్షల్లో ఫీజులు దండుకునే బడా విద్యా సంస్థ నారాయణ పేరుతో హన్మకొండ జిల్లాలో కొత్త దందాకు తెరలేపారు. అడుగడుగునా ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా తమ ఆధిపత్యం చేలాయిస్తూ , అనుమతులు లేని పునాదులపై విద్యా వ్యాపారాన్ని సాగిస్తు సొమ్ము చేసుకుంటున్నారు …. దేశంలో తమకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్పే నారాయణ విద్యా సంస్థల పేరుతో చలామణి అవుతూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. విద్యానసంస్థలను నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని జిల్లాలో విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.సరిగ్గా ఇదే కోవాకు చెందింది హన్మకొండ జిల్లాలోని లోకల్ నారాయణ విద్యా సంస్థలు. జిల్లా విద్యాశాఖ నుండి ఒకే అనుమతి పొందిన సదరు కళాశాల యాజమాన్యం 38290 కళాశాల కోడ్ తో 31-3-58/8 ఇంటి నెంబర్ కలిగిన కోమటిపల్లిలో కాకుండా గోపాలపుర్ లో మరో రెండు అదనపు బ్రాంచీలు నిర్వహిస్తూ విద్యాశాఖ అధికారులకే మస్కా కొడుతుంది.విద్యాశాఖ నుండి కో ఎడ్యుకేషన్ పేరుతో అనుమతులు పొందిన నారాయణ యాజమాన్యం బాయ్స్, గర్ల్స్ అంటూ వేర్వేరు కళాశాలలు నిర్వహిస్తూ రెసిడెన్షియల్ భవనాల్లో ,తరగతులు,హాస్టల్స్ కొనసాగిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంది.ఇరుకుగదుల్లో తరగతుల నిర్వహణతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం అంతా తెలిసి అటువైపు కన్నెత్తి కుడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పలుకుబడి ఉంటే పర్మిషన్ అక్కర్లేదా?
జిల్లా ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాల ఆగడాలు అన్ని ఇన్ని కావు.నూతన కళాశాల స్థాపించాలంటే విద్యాశాఖ పర్మిషన్ లేకున్నా జిల్లాలో పలుకుబడి ఉంటే చాలు.కళాశాలల అసోసియేషన్ నేత అయితే ఇంకా అనుమతులు అన్న పదం తో అస్సలు పనిలేదనే చెప్పొచ్చు. సరిగ్గా ఇదే కోవకు చెందిన యవ్వారం ఈ నారాయణ కళాశాలల యజమానిది.జిల్లాకు చెందిన ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల సంఘానికి అధ్యక్షునిగా కొనసాగుతూ విద్యాశాఖ అధికారులను తన కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని నిలువరిస్తున్నట్లు సమాచారం. అధ్యక్షునిగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నేతే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే మిగితా వారికి ఆగడాలు ఏవిధంగా ఉంటాయో మరి,పైగా అనుమతులు లేని కళాశాల యాజమాన్యాలు ప్రశ్నించిన విద్యార్తి సంఘాలపై కలెక్టర్ మరియు సిపి స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేసి తన దారికి తెచ్చుకోవడం వీరి ప్రత్యేకత …
వేచి చూడాలి మరి ఇప్పటికైనా విద్యా అధికారులు అనుమతులు లేని లోకల్ నారాయణ కళాశాలలపై ఏ విధంగా స్పందిస్తారో మరి…వేచిచూడాలి..