ద్వితీయ శ్రేణి నగరమైన హన్మకొండ లో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలను భేఖాతారు చేస్తూ కళాశాలలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలే పెట్టుబడిగా చేసుకొని వారిని అందినకాడికి ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి. అమాయకత్వంతో కార్పొరేట్ విద్యా సంస్థల తప్పుడు ప్రచారాన్ని నమ్మి వారి ఊబిలో చిక్కుకొని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయింది. విద్యాశాఖ అధికారుల సహకారంతోనే కార్పొరేట్ సంస్థల విద్యా వ్యాపారం మూడు అనుమతులు ఆరు అకాడమీలుగా కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికి వారిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అధికారుల అండదండలు వారికి ఏ మేరకు ఉన్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. హన్మకొండలోని ప్రశాంత్ నగర్ లో గ్రావిటీ విద్యా సంస్థలు కూడా ఇదే కోవాకు చెందినవిగా చెప్పుకోవచ్చు.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఒకే కాలేజీ కి అనుమతి పొంది నగరంలో అకాడమీ, ఐఐటి,జెఈఈ,నీట్,ఎంసెట్ ల పేరుతో బాలబాలికల కు వేర్వేరుగా ఐదు బ్రాంచీలు ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తూ లక్షల్లో ఫీజులు దండుకుంటు విద్యా వ్యాపారాన్ని అడ్డుఅదుపు లేకుండా కొనసాగిస్తున్నారు.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఒక కళాశాల ఏర్పాటుకు అనుమతి పొందాలంటే సొంత భవనాలతో పాటు వారి నియమ నిబంధనలను అనుసరిస్తూ నిర్ధేశించిన సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లు గా విద్యార్థులను చేర్చుకోవాలి.కానీ గ్రావిటీ కళాశాల యాజమాన్యం మాత్రం ఒకే పర్మిషన్ తో అనేక బ్రాంచీలు ఏర్పాటు చేసి వందల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత విద్యా శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పైగా విద్యార్థుల భవిష్యత్తు కార్పొరేట్ కళాశాలల చేతుల్లో కీలు బొమ్మగా మారిందని వారి భవిష్యత్తు కు భరోసా ఏమిటని పలు విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
అనుమతులు లేకుండా అడ్డగోలుగా విద్యా వ్యాపారాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న గ్రావిటీ విద్య సంస్థలకు సహకరిస్తున్న ఆ అధికారులేవరు…
పూర్తి వివరాలు మరో సంచికలో…..